టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై.. 25 అంశాలతో అభియోగ పత్రం

Congress Party Ready To Chargesheet On TRS Govt At Gajwel Sahaba - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధం

రేపు జరిగే గజ్వేల్‌ సభే వేదిక

ఏడేళ్ల పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలపై చార్జిషీట్‌

రూపొందిస్తున్న ముఖ్య నేతలు భట్టి, దామోదర, మధుయాష్కీ

దళిత సీఎం హామీ మొదలు అనేక అంశాల ప్రస్తావన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌ వేదికగా ఈనెల 17న నిర్వహించనున్న ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’లో 25 అంశాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చార్జిషీట్‌ వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. గత ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో రాష్ట్రంలోని దళితులకు జరిగిన అన్యాయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ ఈ చార్జిషీట్‌ను తయారు చేస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్‌లు దీనిని రూపొందిస్తున్నారు. 

16 వేల ఎకరాలిచ్చి, 5 లక్షల ఎకరాలు లాక్కున్నారు
దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి పంపిణీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించ నున్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తానే ముఖ్యమంత్రి కావడం, తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన పదవులు దళిత సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం లాంటివి పొందుపరచనున్నారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం రాష్ట్రంలోని దళితులందరికీ కలిపి ఇచ్చింది కేవలం 16 వేల ఎకరాలు కాగా, కాంగ్రెస్‌ పార్టీ దళితులకు ఇచ్చిన 24 లక్షల ఎకరాల భూమిలో నుంచి 5 లక్షల ఎకరాల భూమిని ప్రాజెక్టులు, ఇతర కారణాలు చూపెట్టి లాక్కుందనే విషయాన్ని ఎత్తిచూపనున్నారు. 

సబ్‌ప్లాన్‌ చట్టానికి తూట్లు
కాంగ్రెస్‌ పార్టీ హయాంలో దళితులు, గిరిజనులకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ పెట్టి చట్టబద్ధం చేస్తే, గత ఏడేళ్లుగా ఆ నిధులను ఖర్చు చేయకుండా చట్టానికి తూట్లు పొడిచారంటూ నేరారోపణ చేయనున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందని, ఈ నిధులను ఖర్చు చేస్తే రాష్ట్రంలోని సగం మందికి దళిత బంధు పథకం అమలవుతుందనే అంశాన్ని గుర్తు చేయనున్నారు. ఎస్సీలకు చెందిన 60 వేల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సాక్షరతా భారత్‌ ఉద్యోగులు, విద్యావాలంటీర్ల లాంటి సుమారు 55 వేల పోస్టులను తీసివేయడం ద్వారా దళిత నిరుద్యోగులకు చేసిన అన్యాయంపై చార్జిషీట్‌ వేస్తున్నామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. వీటితో పాటు దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాల ఘటనలు, వాటి విషయంలో ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు, గత ఏడేళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత తదితర అంశాలతో అభియోగ పత్రం రూపొందిస్తున్నామని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top