టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల | Sakshi
Sakshi News home page

టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల

Published Wed, Aug 30 2023 3:15 AM

Complaints of ruling party leaders to Election Commission - Sakshi

సాక్షి ప్రతినిధి, బాపట్ల: తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకు బాపట్ల జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ఇక్కడ వెల్లడైన దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఒక్క పర్చూరు నుంచే 12,944 ఫారం–7 దరఖాస్తులను  స్థానికులు అధికారులకు సమర్పించారు.

దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు చాలా మంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతోపాటు పర్చూరులోనూ ఓట్లు ఉంచుకున్నారు. కొందరు రెండు చోట్లా  ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ ఓట్లతోనే పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో  టీడీపీ వరుసగా గెలుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు వేమూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించుకొన్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘు­పతి, చీరాల ఇన్‌చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య ఎన్నికల అధికారు­లకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,407 ఫారం–7 దరఖాస్తులు ఇవ్వగా రేపల్లెలో 5,544, బాపట్లలో 3,155, అద్దంకిలో 2,619, చీరాలలో 1,870 ఫారం–7 దరఖాస్తులు ఇచ్చినట్లు సమా­చారం. దీంతోపాటు అక్రమ ఓట్ల జాబితానూ ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. 

టీడీపీ ఉలికిపాటు
దొంగ ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పట్టుబట్టడంతో టీడీపీ ఉలిక్కిపడింది. దీనినుంచి బయట పడేందుకు అధికారపార్టీ నేతలు టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. ఎన్నికల కమిషన్‌కూ తప్పుడు ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేస్తోంది.

కృష్ణజిల్లా నాగాయలంకలో ఉంటున్న జాగర్లమూడి లక్ష్మీతులసికి బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి పోలింగ్‌ బూత్‌ 148లో, మార్టూరు మండలం బొల్లాపల్లి పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 70లో 
రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. 

పర్చూరు మండలం నూతలపాడులో ఉంటున్న మిరియా చాయమ్మకు  దేవరపల్లి 148 పోలింగ్‌ బూత్,  నూతలపాడు 159 బూత్‌లో ఓట్లు ఉన్నాయి. 

సోమేపల్లి చిన్నవెంకటేశ్వర్లు తండ్రి వెంకటాద్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకి హైదరాబాద్‌లో ఓటు ఉంది. దాంతోపాటు దేవరపల్లి పోలింగ్‌ బూత్‌ 148లో సీరియల్‌ నంబర్‌ 631లో కూడా ఓటు ఉంది.  

హైదరాబాద్‌లో నివాసం ఉండే కొమ్మాలపాటి వీరాంజనేయులుకు దేవరపల్లి  148 పోలింగ్‌ బూత్‌లో సీరియల్‌ నంబర్‌ 581తో ఓటు ఉంది. హైదరా­బాద్‌ శేరిలింగంపల్లి పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 430లో సీరి­యల్‌ నంబర్‌ 247తోనూ ఓటు ఉంది.

దొంగ ఓట్లు తొలగిస్తాం 
జిల్లావ్యాప్తంగా సు­మా­రు 30 వేల వరకు ఫారం–7  దరఖా­స్తులు వచ్చాయి. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ చేయి­స్తు­న్నాం. ఫారం–7లను పూర్తిగా పరిశీలించాం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లుంటే తొలగిస్తాం. నిబంధనల మేరకు దొంగ ఓట్లపై చర్యలు తీసుకుంటాం. ఫేక్‌ దర­ఖా­స్తులు చేసిన వారిపైనా చర్యలు ఉంటాయి. – రంజిత్‌బాషా, కలెక్టర్, బాపట్ల జిల్లా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement