జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని, దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత వైషమ్యాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. దేశ అభ్యున్నతి కోసం ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యంగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల చూపు సీఎం కేసీఆర్ వైపు ఉందని అన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అని, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.