బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌! 

CM KCR Appointed Thota Chandrasekhar Ias AP BRS Party President - Sakshi

సీఎం కేసీఆర్‌ సమక్షంలో నేడు పలువురు ఏపీ నేతల చేరిక 

మాజీమంత్రి రావెల కిశోర్‌బాబుతో పాటు మరికొందరు 

చేరిక జాబితాలో మాజీ ఐఆర్‌ఎస్‌ పార్థసారథి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలకనేత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌కు ఏపీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో తోట చంద్రశేఖర్, మాజీమంత్రి రావెల కిశోర్‌బాబుతో పాటుగా పలువురు నేతలు కూడా పార్టీలో చేరేందుకు సోమవారం రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు వీరి చేరిక కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

చేరిక అనంతరం ఆంధ్రప్రదేశ్‌ బీఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ప్రకటిస్తారని, ఆయన సమక్షంలోనే తోట చంద్రశేఖర్‌ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కాగా, రావెల కిశోర్‌ బాబు, తోట చంద్రశేఖర్, ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్‌తో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరతారు.

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్‌ 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిత్య హైజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఏలూరు ఎంపీగా, 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇదిలాఉంటే 1987 ఐఆర్‌టీఎస్‌ కేడర్‌ అధికారి రావెల కిశోర్‌ బాబు 2014–18 మధ్యకాలంలో ఏపీ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top