జనసేనలో భగ్గుమన్న విభేదాలు

Chittoor: Conflict Between Activists in Janasena Party Have Erupted - Sakshi

పార్టీ కార్యాలయంలో కార్యకర్తల బాహాబాహీ 

చేనేత నాయకుడిపై మహిళా నాయకురాలు అనిత దౌర్జన్యం 

రాయలసీమ కో–కన్వీనర్‌ కళ్లెదుటే ఘటన

సాక్షి, మదనపల్లె: జనసేన పార్టీలో కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో జనసేన రాయలసీమ కో–కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి కళ్లెదుటే చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సురేంద్రపై జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత దూషిస్తూ దాడికి దిగారు. తన జోలికి వస్తే ఎవరినీ వదిలేది లేదంటూ చివరికి ఘటనను కవరేజ్‌ చేస్తున్న మీడియాను సైతం దూషించారు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. పార్టీలో దారం అనిత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తోందని అడపా సురేంద్ర రాష్ట్ర కార్యవర్గానికి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మదనపల్లెలో సోమవారం జనసేన రాయలసీమ కో–కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలశివరాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అడపా సురేంద్ర హాజరుకాగా దారం అనిత రాలేదు. సమావేశం ముగిసి కార్యకర్తలు బయలుదేరే సమయానికి కార్యాలయానికి వచ్చిన అనిత నేరుగా అడపాసురేంద్రపై బూతులు మాట్లాడుతూ దాడికి దిగారు. అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించారు. పార్టీలో తనకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కార్యకర్తలు, నాయకులు విస్తుపోయారు. దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పరువు పోయిందని భావించిన రాందాస్‌చౌదరి ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు.   చదవండి: (సీఐ గారి రైస్‌మిల్‌ కథ!.. సుప్రియ పేరుతో)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top