అందుకేనట బాబు రహస్య మంతనాలు! | Chandrababu Naidu Meets DK Shivakumar - Sakshi
Sakshi News home page

చంద్రబాబు దింపుడు కల్లం ఆశ.. అందుకేనట బాబు రహస్య మంతనాలు!

Published Thu, Dec 28 2023 9:08 PM

Chandrababu Meets DK Shivakumar - Sakshi

అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్థితి.. చచ్చిన తెలుగుదేశాన్ని లేపి.. మళ్ళీ నాగినీ డాన్స్ అందించడానికి అయన ఎన్ని విధాలా నాగస్వరం ఊదుతున్నా అయన బుగ్గలు నెప్పెడుతున్నాయి తప్ప పాము లేవడం లేదు.. దీంతో కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని పార్టీకి బలం చేకూరుద్దామని ప్రయత్నించారు. అబ్బే.. కుదరలేదు. గజ్జి తగ్గడానికి మందు రాస్తే ఆ గజ్జి చేతికి అంటుకుంది తప్ప గజ్జి మానలేదు. చంద్రబాబుతో అంటకాగిన కొద్దీ పవన్ కళ్యాణ్ బలహీనం అయ్యాడు కానీ టీడీపీకి లాభం రాలేదు... పైగా కాపులు ఇప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలిపి జాయింటుగా టార్గెట్ చేసి తిడుతున్నారు. దీంతో ఆ పీకే అచ్చిరాలేదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK ) ను తెచ్చారు. 

రోగిలో చలనం లేనపుడు, అవయవాలన్నీ చచ్చుబడిపోయినపుడు ఎంత పెద్ద డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు.... ఆయన  కూడా చెక్ చేసి.. కష్టం. ఇంకొన్నాళ్లే బతుకుతాడు.. దగ్గరోళ్ళు ఉంటె పిలుచుకోండి.. కడసారి చూపులు చూసుకోండి అని చెప్పేసినట్లు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు. దీంతో. ఇక చంద్రబాబుకు మిగిలింది దింపుడు కల్లం ఆశ మాత్రమే మిగిలింది.. దీంతో ఇప్పుడు తాజాగా మంచి సక్సెస్ రికార్డ్‌తో దూసుకుపోతున్న కర్ణాటక కాంగ్రస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం దగ్గర్నుంచి తెలంగాణాలో అసలు రేసులోనే లేని కాంగ్రెసును అధికార పీఠం ఎక్కించిన ఎపిసోడ్ తాలూకు క్రెడిట్ మొత్తం డీకే శివకుమార్ కు దక్కింది. దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకుని కొన్ని ఎత్తులు.. పొత్తులు.. జిత్తులను ప్లాన్ చేసే నిమిత్తము ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.. ఎటు చూసినా కారుచీకటి. గెలిచే సీట్ ఎక్కడా కానరావడం లేదు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం కుప్పంలో పోటీకి భయపడి రెండోచోట పోటీ చేస్తారని అంటున్నారు. 

అంటే టీడీపీ శిబిరం బయటకు బిల్డప్పులు బాగానే కొడుతున్నా లోలోన ఓటమి భయం వెన్నాడుతోంది. దీంతో  అటు లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి తయారవుతున్నారు. ఇక జగన్ కాదని వదిలేసిన వంశీ, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలాంటి వాళ్ళే ఇప్పుడు బాబుకు దిక్కవుతున్నారు. దీంతో దిక్కుతోచని అయన ఏకంగా కాంగ్రెస్ నాయకులతోనే పొత్తులగురించి చర్చించే స్థాయికి దిగిపోయారు.. వాస్తవానికి 2019లో కూడా ఎన్డీయేను వదిలేసి కాంగ్రెస్ కూటమిలో చేరి దేశమంతా తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్ బతికిబట్టగట్టలేదు సరికగా తాను వంద తిట్లు తిట్టినా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సైతం చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. 
-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement