
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్‌షో, పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.
వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.