స్థానిక ఎన్నికల్లో పోటీచేద్దాం: చంద్రబాబు

Chandrababu Comments About local bodies elections - Sakshi

పార్టీ శ్రేణులు, నాయకుల ఒత్తిడితో చంద్రబాబు అంగీకారం

పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపు 

సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో గతంలో ఆగిపోయిన స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఆగిపోయిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే టీడీపీలో సందిగ్ధం నెలకొంది. గతంలో పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై కొంత అయోమయం నెలకొంది. చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో పోటీలో ఉంటున్నట్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురవడంతో టీడీపీ కుంగిపోయింది. దీంతో ప్రజా పరిషత్‌ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. చంద్రబాబు నిర్ణయంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

ఆయన్ని ధిక్కరించి అనేకచోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడంపైనా పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. వరుస ఓటములకు భయపడి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపో యిన స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కచ్చితం గా పోటీచేయాలని పార్టీ శ్రేణులు, నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పోటీకి దూరంగా ఉండి గతంలో చేసిన తప్పును మళ్లీ చేయవద్దని సీనియర్లు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు చంద్రబాబు అంగీకరించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నేతలకు సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top