కులం పేరిట బాబు విష రాజకీయం

Chandrababu Caste Politics In Andhra Pradesh - Sakshi

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి.

కులం.. ఓ అస్త్రం

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్‌ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. 

పవన్‌తో పొత్తు.. దేనికి సంకేతం

పవన్‌ కళ్యాణ్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్‌ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్‌లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్‌ కళ్యాణ్‌ అనే చాప్టర్‌ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్‌కళ్యాణ్‌ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్‌తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్‌ రూపం మాత్రమే. 

పవన్‌ వెనక ఉన్న వారెవరు?

పవన్‌ కళ్యాణ్‌ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్‌కళ్యాణ్‌. నిజంగా పవన్‌ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు,  బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్‌ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్‌ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు.

మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు

రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్‌. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్‌. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్‌. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాస్‌ను, అగ్రోస్‌ ఛైర్మన్‌గా నవీన్‌ నిశ్చల్‌ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు.  నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఫారెస్ట్‌ బోర్డు మెంబర్‌గా నయనార్‌ శ్రీనివాసులును నియమించారు. 

పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్‌వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్‌. 

బలిజలంతా వైఎస్‌ఆర్‌సీపీ వైపే : రత్నాకర్‌

వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్.  మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. 

పవన్‌తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top