ఏపీ బకాయి పడిందంటూ కేసీఆర్‌ కొత్త పంచాయితీ.. ఆయన లెక్కలు సరైనవేనా?

Center Orders TS Govt CM KCR Comments On AP Dues Is It Workout - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త పంచాయితీ పెట్టారు. ఎపి ప్రభుత్వమే తెలంగాణకు రూ.17,828 కోట్లు ఇవ్వాలన్న వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎపి నుంచి విద్యుత్ తీసుకున్నందుకు గాను తెలంగాణ ఇవ్వవలసిన మూడువేల కోట్లు, గత కొన్ని సంవత్సరాలుగా చెల్లించనందుకుగాను వడ్డీ మూడు వేలు , మొత్తం ఆరువేల కోట్లు వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం కేంద్రానికి వినతులు ఇస్తోంది. తాజాగా ప్రధాని  నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చేసిన విజ్ఞప్తిలో కూడా ఈ అంశం ప్రముఖంగా ఉంది. ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఎపికి ఆరువేల కోట్లు రూపాయలు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 

కెసిఆర్ దానిని వివాదాస్పదం చేస్తున్నారు. తమకే ఎపి రూ.17,828 కోట్లు ఇవ్వాలని, అందులో నుంచి ఈ ఆరువేల కోట్లు మినహాయించుకుని , మిగిలిన మొత్తం తమకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగానే ఎపి ప్రభుత్వం ఆ మొత్తం ఇవ్వవలసి ఉంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే. కాని ఇంతవరకు ఎన్నడూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి బాకీ ఉన్నట్లు కేంద్రానికి తెలియచేసినట్లు కనిపించదు. కెసిఆర్ ఇదంతా అధికారిక లెక్క అని చెబుతున్నా, అందుకు తగ్గ ప్రాతిపదిక కూడా అవసరమే. అలాకాకుండా ఎపి ప్రభుత్వానికి బాకీ చెల్లించకుండా ఉండడానికి పోటీగా ఈ లెక్కలు చెబితే అంత అర్దవంతంగా ఉండకపోవచ్చు. 

ఒక వైపు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న కెసిఆర్‌, తన పొరుగు రాష్ట్రమైన ఎపితోనే సంబంధాలు సజావుగా నడపడం లేదన్న భావన వస్తే అది ఆయనకు రాజకీయంగా నష్టం చేస్తుంది. ఎపి ప్రభుత్వం ఇవ్వవలసినవి అంటూ ఆయన ఇచ్చిన వివరణ లో  విద్యుత్ ఉద్యోగుల ట్రస్టు నిధులు ఉన్నాయని, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణ వాటా ఉందని చెప్పారు. తాను ఎక్కువగా మాట్లాడుతున్నాననే ఎపికి ఆరువేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కెసిఆర్ ఆరోపించారు. నిజానికి కేంద్రం ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. ఈ నిర్ణయం చేయడానికి కేంద్రం ఎవరు అని ఆయన ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం.

ఒకవేళ కేంద్రం నిర్ణయంలో తప్పు ఉంటే దానిని ఎత్తిచూపవచ్చు. కాని విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కాని అంశాలను కేంద్రమే చొరవ తీసుకుని సాల్వ్ చేయాలని స్పష్టంగా ఉంది. దానిని కెసిఆర్ విస్మరించలేరు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటా ఎలా వస్తుందో తెలియదు. అది నిజమే అయితే తెలంగాణలో ఉన్న కొన్ని పవర్ ప్లాంట్ లలో తమకు వాటా ఇవ్వాలని ఎపి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న వివిధ సంస్థల ఆస్తులు, బ్యాంకులలో ఉన్న నగదు పంపిణీ చేసుకోవలసి ఉన్నా, ఇంతవరకు అవి ఎటూ తెగడం లేదు. దీనివల్ల ఎపికే ఎక్కువ నష్టం జరుగుతుంది. 

తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున ఇక్కడి వివిధ సంస్థల ఆస్తులు ఈ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. ఎపి ప్రభుత్వానికి ఆ అవకాశం ఉండదు. వారు తమ వాటా అడగడం తప్ప చేయగలిగింది లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సున్నిత మైన సమస్యలను ముందుగానే పరిష్కరించి విభజన చేసి ఉంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేది. అలాకాకపోవడం వల్ల ఆంద్రకు నష్టం జరిగిందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అలాగే పోలవరం ముంపు మండలాలను ఎపికి కేటాయించడం, సీలేరు హైడల్ ప్రాజెక్టు గురించి కూడా కెసిఆర్ ప్రస్తావించారు. కాని ఆయన ఒక విషయం మర్చిపోతున్నారు. 

1956కి ముందు భద్రాచలంతో సహా పోలవరం ముంపు మండల ప్రాంతం అంతా ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. కాకపోతే సదుపాయాల రీత్యా దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారు. అప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం కనుక ఇబ్బంది రాలేదు. కాని విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపధ్యంలో దానిని పూర్తి చేయాలంటే ఈ ముంపు మండలాలు ఎపిలోనే ఉంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించి ఆర్డినెన్స్ జారీచేయించారు. అప్పుడు ఆ పని జరగకపోతే, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మద్య తలెత్తున్న పలు వివాదాలలో అది కూడా ఒకటి అయ్యేది. 

పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడమే కష్టం అయ్యేది. ముందుగా ముంపు మండలాల పరిహారం తదితర సంగతులు తేల్చాలని, అంతవరకు ప్రాజెక్టు ముందుకు తీసుకు వెళ్లడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించి ఉండేదేమో! కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ ఎంతైనా విరుచుకుపడనివ్వండి. కేంద్రంలో బిజెపిని దేవుడు కూడా కాపడలేరని, నాన్ బిజెపి ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పనివ్వండి. మంచిదే. ఆయన ప్రధాని హోదాకు వెళితే తెలంగాణ ప్రజలతో పాటు ఆంద్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కాని ఆ ప్రయత్నంలో ఉన్న తరుణంలో కెసిఆర్ ఇలాంటి తగాదాలు పెట్టుకుంటే ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. 

ఎపి కి వ్యతిరేకంగా సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ఇక ఇవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎపి, తెలంగాణల మధ్య పలు అంశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కెసిఆర్ పట్ల గౌరవంగా ఉండే వ్యక్తే.  అందువల్ల సీనియర్ నేతగా కెసిఆర్ ఇప్పటికైనా చొరవ తీసుకుని ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోగలిగితే మంచి పేరు వస్తుంది. తద్వారా దేశానికి ఒక మంచి సందేశం అందించినవారు అవుతారు. ఒక జాతీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందుతారు. మరి అది కెసిఆర్ చేతిలోనే ఉంది.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top