కెప్టెన్‌ గేమ్‌ప్లాన్‌ ఏమిటో..!

Captain Amarinder Singh Followers joins bjp - Sakshi

అమరీందర్‌ సన్నిహితులు బీజేపీలోకి...

కాంగ్రెస్‌ను సాధ్యమైనంత దెబ్బకొట్టడమే లక్ష్యమా?

పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్‌సీ, శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఇటీవల ప్రకటించారు.

కాంగ్రెస్‌లోని తన  అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్‌ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్‌ గేమ్‌ప్లాన్‌ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఎవరెవరు వెళ్లారంటే..
మాజీ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి (గురుహర్‌ సహాయ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్‌ కేబినెట్‌లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్‌లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్‌ ఎమ్మెల్యే ఫతేజంగ్‌ బజ్వా, శ్రీహరిగోవింద్‌పూర్‌ ఎమ్మెల్యే బల్విందర్‌ సింగ్‌ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ రావడానికి అమరీందర్‌ సహాయపడ్డారు.

ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్‌ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్‌ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్‌ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్‌ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది.  

పరస్పర అవగాహనతోనేనా..!
కెప్టెన్‌ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రిన్స్‌ ఖుల్లర్‌ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల  నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్‌ చెప్పారు. రాణా గుర్మీత్‌ సోధి ఫిరోజ్‌పూర్‌ నుంచి, ఫతేజంగ్‌ బజ్వా హిందూ బెల్ట్‌ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్‌’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్‌ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. 

గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్‌సీ అధికార ప్రతినిధి ఖుల్లర్‌ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్‌సీ, శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్‌ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్‌ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్‌– బీఎస్‌పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది.    

 – నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top