బీఎస్పీ అధికారంలోకి వస్తే  33 జిల్లాల్లో 33 సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటు 

BSP Student Manifesto Released by RSP - Sakshi

ప్రతి విద్యార్థికీ ఖర్చుల కోసం ఏడాదికి రూ.7,500 ఇస్తాం 

బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టో విడుదల చేసిన ఆర్‌ఎస్పీ 

హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో బహుజన విద్యార్థి భరోసా సభ 

హన్మకొండ చౌరస్తా, నయీంనగర్‌: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.7,500 అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హామీనిచ్చారు. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో మంగళవారం ‘బహుజన విద్యార్థి భరోసా’సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. 

బీఎస్పీ హామీలివే... 
పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుంచి వంద మందికి విదేశీ విద్య అందిస్తామని, అందులో 50మంది విద్యార్థినులు ఉంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని, కేజీ నుంచి ఇంటర్‌ చదివే  విద్యార్థులకు కోడింగ్‌ భాష నేర్పుతామని హామీనిచ్చారు. 8నుంచి 12 తరగతి విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నేర్పిస్తామన్నారు.

విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలు లేకుండా కార్యాచరణ రూపొందిస్తామని, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోతే కాంట్రాక్టర్లను చేస్తామని వాగ్దానం చేశారు. శ్రీకాంతాచారి పేరు తో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని,  పేపర్‌ లీకేజీలు లేకుండా చర్యలు చేపడతామని, పూర్ణ, ఆనంద్‌ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీ య ప్రమాణాలతో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతుండగా గద్దర్‌ మరణ వార్త తెలిసినా సీఎం కేసీఆర్‌ కనీసంగా స్పందించలేదని, సంతాప తీర్మానం చేయలేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top