సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్ డైవర్షన్‌చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్, హరీష్ పోరాడుతున్నారు. ఈ-కార్ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు.
అదొక చెల్లని సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్‌తో మరొక సిట్ వేశారు. ఈ సిట్‌కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్‌కు చీఫ్‌గా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్‌పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్‌పై విచారణ జరగాలి.
నిజంగా సిట్ వేయాలనుకుంటే.. చెక్ డ్యామ్‌లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్ స్కామ్‌పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్ వేశారు. దేశ రక్షణపై రేవంత్‌రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్.


