‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్‌ ప్లాన్ ఏంటి?

Brs Party Plans To Clean Sweep In Assembly Elections Nalgonda - Sakshi

ఉమ్మడి నల్గొండ జిల్లాను మరోసారి స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? అధినేత ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పొరపాట్లు సరిచేసుకుంటున్నారా? తప్పులు దిద్దుకోనివారి పరిస్థితి ఏంటి? టిక్కెట్ కోసం కొట్టుకుంటున్నవారిని ఎలా దారికి తెస్తారు? గులాబీ పార్టీకి చికాకు తెప్పిస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది? 

అది కాంగ్రెస్‌కు కంచుకోట
నల్గొండ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోట అని చెబుతారు. ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందినవారే ఉన్నారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో లేరు. జిల్లా మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు గెలుచుకోవడం ద్వారా నల్గొండ జిల్లాను గులాబీ సేన క్లీన్ స్వీప్ చేసేసినట్లయింది. రానున్న ఎన్నికల్లో కూడా మొత్తం 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లాలో తమదే తిరుగులేని ఆధిపత్యం అని చాటుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి చికాకు తెప్పిస్తోంది.

ఉమ్మడి జిల్లాలోని ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్‌ మధ్య సీటు పోరు కొంతకాలంగా సాగుతోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన రవీంద్రకుమార్‌కు కాకుండా తొలినుంచీ ఉద్యమంలో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన దేవేందర్ నాయక్‌ గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బయట పడినట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతన్న సమయంలోనే దేవేందర్ నాయక్ తన వర్గంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారట. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసమ్మతి వెనుక ఓ సీనియర్‌ నేత
మరోవైపు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కేడర్‌కు కూడా అర్థంకాక తలలు పట్టుకున్నారట. ఇదే విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తీరు పట్ల నియోజకవర్గంలోని నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ గాని, ప్రభుత్వం కాని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే నేతలంతా ఒక వర్గంగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేశారట. ఈ అసమ్మతి వెనుక జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

రవీంద్ర కుమార్ మాజీ గురువు అయిన ఆ నేత....తనను కాదని మరో పవర్ సెంటర్‌లో చేరిపోయిన తన మాజీ శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఆ సీనియర్ నేతకు దేవరకొండపై మంచి పట్టు ఉండటంతోపాటు తన వైరివర్గంలో చేరిన ఎమ్మెల్యేకు ఎలా అయినా చెక్‌ పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నారట. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్‌ను తన వైపు తిప్పుకున్నారట.  ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేవరకొండలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య టిక్కెట్ పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top