రంకెలు వేస్తే అంకెలు మారవు | BRS Leader Harish Rao Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

రంకెలు వేస్తే అంకెలు మారవు

Jul 5 2026 2:11 AM | Updated on Jul 5 2026 5:13 AM

BRS Leader Harish Rao Fires On Congress Govt

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే 

దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం 

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సవాల్‌ 

కాంగ్రెస్‌ ఇప్పటివరకు రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: అప్పుల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, రోజూ బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్‌మీట్లలో ఇంకోలా చెబుతున్నారు. 

బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్‌ శిష్యుడిగా చెప్తున్నా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే. దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం..’అని మరోసారి సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి అప్పులు ఇప్పించేందుకు సచివాలయం చుట్టూ బాంబే, గుజరాత్‌ బ్రోకర్లు తిరుగుతున్నారని లంచాలు ఇచ్చి అప్పులు తెచ్చే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన అప్పుల లెక్కలకు కౌంటర్‌ ఇచ్చారు. 

రేవంత్, భట్టి..ఎవరు చెప్పింది నిజం? 
‘భట్టి విక్రమార్క వెల్లడించిన పత్రాల్లో.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న రూ.84,268 కోట్ల రుణాలను, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఖాతాలో కలిపేశారు. ఈ రెండూ కలిపి రూ.99,386 కోట్లను 2023 డిసెంబర్‌ నాటికి ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే అసలు అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం, కాగ్‌ నివేదిక, ఆర్బీఐ గణాంకాలు, ఎకనామిక్‌ సర్వే అన్నీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.1.77 లక్షల కోట్లే అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? లేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమా? నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గింది?..’అని హరీశ్‌రావు నిలదీశారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. 

అప్పుల కోసం రూ.వందల కోట్ల కమీషన్లు 
‘ప్రస్తుత ప్రభుత్వం అప్పులు కూడా పారదర్శకంగా తీసుకురాలేక బ్రోకర్లకు వందల కోట్ల రూపాయల కమీషన్లు చెల్లిస్తోంది. టీజీఐఐసీ భూముల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు కోసం రూ.170 కోట్ల బ్రోకరేజ్‌ చెల్లించారు. హెచ్‌ఎండీఏ భూములపై మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తే మొత్తం రూ.510 కోట్ల వరకు బ్రోకర్లకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డిస్కంలు, హైదరాబాద్‌ కార్పొరేషన్లు, వాటర్‌ బోర్డు ద్వారా మరో రూ.70 వేల కోట్ల అప్పు సమీకరించే లక్ష్యంతో మొత్తం లక్ష కోట్ల అప్పులకు రూ.1,710 కోట్ల వరకు కమీషన్లు వెళ్తున్నాయి..’అని హరీశ్‌రావు ఆరోపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement