రేవంత్‌.. నిరుద్యోగుల నిర్బంధం, అరెస్ట్‌ దుర్మార్గం: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. నిరుద్యోగుల నిర్బంధం, అరెస్ట్‌ దుర్మార్గం: కేటీఆర్‌

Jul 4 2025 1:25 PM | Updated on Jul 4 2025 1:44 PM

BRS KTR Serious Comments On Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు అంటూ విమర్శించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్‌ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా?. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్‌కు గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా?.

చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గం. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60వేల ఉద్యోగాలకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం.

ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతాం.. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం.. జై తెలంగాణ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement