ఉద్యోగ సంఘాలొస్తేనే చర్చలు 

Botsa Satyanarayana Comments On Chandrababu And Empoyees unions - Sakshi

ఆహ్వానించినా వారు చర్చలకు రాలేదు 

ప్రచారార్భాటాలు, విమర్శలకే చంద్రబాబు పరిమితం 

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు శంకుస్థాపన 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పీఆర్‌సీపై స్పష్టంగా మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా వారు రాలేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  ఉద్యోగ సంఘాలు ఎప్పుడు వస్తే అప్పుడు పీఆర్‌సీపై స్పష్టత కోసం చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పిరిడి వద్ద తోటపల్లి పిల్ల కాలువలు, మిగులు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోటి ఎకరాలకు సాగు నీరివ్వాలన్న జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 85 శాతం పూర్తి చేశారని చెప్పారు.

తర్వాత అంచనాలు పెంచేసి, మిగిలిన కొద్దిపాటి పనులనూ పూర్తి చేయకుండానే అంతా తామే చేశామని బుకాయించడం చంద్రబాబుకు, అతని తఫేదార్లకే చెల్లిందన్నారు. వారి పాలనా కాలమంతా ప్రచారార్భాటాలకు, ప్రతిపక్షంపై విమర్శలకే సరిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత తీసుకుని తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు, పిల్ల కాలువల పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో బొబ్బిలి ప్రాంతం వద్ద రూ.58.59 కోట్లతో చేపట్టే మొదటి ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రెండో ప్యాకేజీ నెల్లిమర్ల వద్ద మరో రూ.60 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.  

సంక్షేమం, అభివృద్ధి పరుగులు 
తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్‌ అల్లకల్లోలం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రెండేళ్లలో లక్షా 30 వేల కోట్ల రూపాయల మేర సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, జలవనరుల శాఖ నార్త్‌ కోస్ట్‌ సీఈ శంబంగి సుగుణాకరరావు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top