ఎన్నికలొస్తున్నాయిగా..మీకోసమే ఐయామ్‌.. వెయిటింగ్‌

BJP following Congress by misusing central agencies says Akhilesh Yadav - Sakshi

సీబీఐ, ఈడీలూ వస్తాయి

వారి రాక కోసం ఎదురుచూస్తున్నా

సన్నిహితులపై ఐటీ దాడుల మీద అఖిలేశ్‌ స్పందన

‘బీజేపీ.. అచ్చంగా కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్‌ ఎవరినైనా భయపెట్టాలనుకుంటే వారిపైకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించేది. ఈ రోజు బీజేపీ అదే  చేస్తోంది’

లక్నో/రాయ్‌బరేలి: ఎన్నికలు సమీపించగానే.. రాజకీయ ప్రత్యర్థులపైకి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను శాఖ (ఐటీ)ను ఉసిగొల్పుతుందని సమాజ్‌వాది  పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం అఖిలేశ్‌ సన్నిహితులు ముగ్గురిపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై ఎస్పీ చీఫ్‌ స్పందిస్తూ... ‘నేను ముందు నుంచీ చెబుతున్నాను.

ఎన్నికలు దగ్గరపడగానే.. ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీల దాడులు మొదలవుతాయని. ఇప్పుడు ఐటీ వాళ్లొచ్చారు. తర్వాత సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)లు రంగంలోకి దిగుతాయి. వారి రాకకోసం ఎదురుచూస్తున్నా. వాళ్లు ఏంచేసినా సైకిల్‌ (ఎస్పీ ఎన్నికల చిహ్నం) ఆగదు... ఇదే వేగంతో ముందుకెళతాం. రథయాత్ర, పార్టీ తీసుకున్న ఇతర కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయి. యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదు. ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజలను మాయ చేయలేరు.

రాజీవ్‌ రాయ్‌పై ఇవే ఐటీ దాడులు నెల కిందట ఎందుకు జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. బీజేపీకి ఓటమి భయం పెరిగేకొద్దీ ఈ దాడులూ పెరుగుతాయి’ అని కాషాయదళంపై ధ్వజమెత్తారు. రాజీవ్‌ రాయ్‌ ఎస్పీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి. కర్ణాటకలో పలు విద్యాసంస్థలను నడిపే గ్రూపునకు యజమాని. అఖిలేశ్‌ వ్యక్తిగత కార్యదర్శి జ్ఞానేంద్ర యాదవ్, ఎస్పీకి కంచుకోట నిలుస్తున్న మెయిన్‌పూరికి చెందిన వ్యాపారవేత్త (ఆర్‌సీఎల్‌ గ్రూపు యజమాని), అఖిలేశ్‌కు సన్నిహితుడైన మనోజ్‌ యాదవ్‌లపై కూడా శనివారం ఐటీ దాడులు జరిగాయి.  
రెండూ ఒకటే..
లఖీంపూర్‌ ఖేరిలో రైతులపై హింసాకాండను జలియన్‌వాలా భాగ్‌ ఊచకోతతో పోల్చారు అఖిలేశ్‌. ‘జలియన్‌వాలా భాగ్‌లో బ్రిటిషర్లు ప్రజలను ముందు నుంచి కాల్చారు.. లఖీంపూర్‌లో బీజేపీ నేతలు వెనకనుంచి రైతులపైకి జీపును తోలార’ని రాయ్‌బరేలీలో రథయాత్ర సందర్భంగా విలేకరులతో అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top