West Bengal Election 2021: ‘నందిగ్రామ్‌’ పోరు రసవత్తరం

Bitter War Of Words Between Mamata Banerjee, Suvendu In Nandigram - Sakshi

సువేందు, మమత పోటాపోటీ ప్రచారం

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్‌.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్‌ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ జరుగనుంది.

ఈ దశలో హాట్‌ టాపిక్‌గా మారిన నందిగ్రామ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు.

పరస్పరం తీవ్ర ఆరోపణలు 
ఏప్రిల్‌ 1వ తేదీన పోలింగ్‌ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కీలకంగా ఆ ముగ్గురు నేతలు
నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్‌ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్‌ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు.

మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్‌ షేక్‌ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్‌ పాల్‌ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్‌ పాల్‌ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. 

ఉద్ధండులు వర్సెస్‌ ఫైర్‌బ్రాండ్‌
మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్‌ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్‌ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్‌ ప్రతిరోధ్‌ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు.   

బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం
కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్‌ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్‌ ఒకటో తేదీన పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్‌ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్‌ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top