బీజేపీ ఎఫెక్ట్‌.. బీహార్‌ కేబినెట్‌ నుంచి మంత్రి అవుట్‌, ఆ పార్టీలో మిగిలింది ఒక్కడే!

Bihar CM Nitish Sacks VIP chief Mukesh Sahani After BJP Demand - Sakshi

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, బీజేపీ డిమాండ్‌కు తలొగ్గారు. తన కేబినెట్‌లోని మంత్రి ముఖేష్‌ సహానిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది.

ముఖేష్‌ సహాని.. నితీశ్‌ కేబినెట్‌లో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఆయన్ని కేబినెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు నితీశ్‌ ప్రకటించారు. ముఖేష్‌ ‘వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ’ (విఐపీ) వ్యవస్థాపకుడు. అధికారి ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ.

ముఖేష్‌ను తొలగించాలంటూ బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ మేరకు బీజేపీ ఓ లేఖ సైతం రాసింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తొలగించాలంటూ రాజ్‌భవన్‌కు సీఎం నితీశ్‌ ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ తన వాట్సాప్‌ అధికారిక గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది కూడా. తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందంటూ పేర్కొంది కూడా.

2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఎన్డీఏ కోటాలో భాగంగా 11 సీట్లను వీఐపీకి కేటాయించింది బీజేపీ. అందులో నాలుగు స్థానాల్లో వీఐపీ గెల్చింది.  ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు.. మొదటి నుంచి బీజేపీకి విధేయులుగా ఉన్నారు. ఈ తరుణంలో గత వారం అధికారికంగా ఈ ముగ్గురు బీజేపీలో చేరిపోయారు. దీంతో ముఖేష్‌ సహాని ఒంటరి అయిపోయారు. 

అయితే సహాని తొలగింపు వెనుక రాజకీయ ప్రతీకారాలు ఏవీ లేవని, కేవలం మత్స్య కమ్యూనిటీలో ఆయన(వికాస్‌ సహానీ) చేస్తున్న మోసాలు, అవినీతి బయటపడడంతోనే ఆయన్ని తొలగించాలని సిఫార్సు చేశామని బీహార్‌ బీజేపీ చీఫ్‌ సంజయ్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ముఖేష్‌ అనుచర గణం మాత్రం.. పార్టీ విలీన ప్రతిపాదనను అంగీకరించకపోవడం, అధిష్టాన నిర్ణయాలకు ముఖేష్‌ వ్యతిరేకంగా వెళ్తుండడం వల్లే ఇదంతా అని ఆరోపిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top