
- రైతులకు వైఎస్సార్‌సీపీ శిక్షణ ఇస్తోందని ఎలా మాట్లాడతారు?
- వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు పెడతామని బెదిరిస్తున్నారు
- రైతులు వచ్చే వాహనాలకు పెట్రోల్ పోయవద్దని బంక్ నిర్వహకులకు హెచ్చరికలు
- లారీల్లో రైతులు మామిడి కాయలు తీసుకురాకూడదని ఆంక్షలు
- జిల్లా లోనివైఎస్సార్‌సీపీ నాయకులకు ముందస్తు నోటీసులు, అరెస్ట్‌లు
- పోలీస్ అధికారులు వ్యవహరించే తీరుకు భిన్నంగా వ్యవహారశైలి
- చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు:
- మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేయాలనే చంద్రబాబు కుట్రలకు అనుగుణంగా జిల్లా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనపై శాంతిభద్రతల అంశాన్ని అడ్డం పెట్టుకుని జిల్లా ఎస్పీ మణికంఠ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
రైతులు తమ పంటలను లారీల్లో మార్కెట్ యార్డ్‌కు తీసుకురాకూడదని, వారు వాటిని రోడ్డుపై పారవేసి రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమంటూ జిల్లా ఎస్పీ రాజకీయంగా మాట్లాడటం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ రైతులను, పార్టీ శ్రేణులను బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు బుధవారం ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మామిడి మార్కెట్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు ఇస్తున్నామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పోలీసులు అనేక ఆంక్షలును విధిస్తున్నారు. ఎక్కడికక్కడవైఎస్సార్‌సీపీ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన కూడదంటూ ముందస్తు అరెస్ట్‌లతో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. బస్తర్ అడవుల్లో నక్సల్స్‌ను వేటాడుతున్నట్లుగా చిత్తూరు జిల్లాలోవైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెంటాడుతున్నారు.
పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ అధికారుల మీదవైఎస్సార్‌సీపీకి మంచి గౌరవం ఉంది. కానీ దానికి భిన్నంగా వైఎస్ జగన్ పర్యటనను దెబ్బతీసేలా అదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ జన సమీకరణ చేస్తున్న వారిని గుర్తిస్తున్నాం, వారిని అరెస్ట్ చేసి, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఆటోలు, మోటార్ సైకిళ్ళపై వస్తుంటే, వారి వాహనాలకు పెట్రలో, డీజిల్ పోయవద్దంటూ పోలీసులే పెట్రలో బంక్ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ఆటోల్లో వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఎక్కించుకోవద్దని, అలా చేస్తే కేసులు పెడతామంటూ వారిని కూడా బెదిరిస్తున్నారు.
పదిమంది రైతులు మాత్రమే మాట్లాడాలని ఆంక్షలు
తమ అభిమాన నాయకుడిని చూడాలని రైతులతో పాటువైఎస్సార్‌సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూడా వస్తుంటే, వారిని కూడా శాంతిభద్రతల సమస్యను ముందు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులను గూండాలు, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సమంజసం కాదు. ప్రజల హక్కులను కూడా కాలరాయాలని అనుకోవడం రాజ్యాంగ విరుద్దం. మార్కెట్ యార్డ్‌లో వైఎస్ జగన్‌ను కలిసేందుకు గరిష్టంగా పదిమందిని మాత్రమే అనుమతిస్తామని జిల్లా ఎస్పీ చెప్పడం దారుణం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల అప్పులపాలై, తమను ఎవరు ఆదుకుంటారా అని ఆక్రోశిస్తున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను రైతులు కలవడానికి కూడా ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామికమా? ఇప్పటి వరకు మామిడి రైతులు కనీసం తమకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని గొంతువిప్పి బయటకు చెప్పుకోలేని నిర్భందంలో ఉన్నారు. అలాంటి వారికి వైఎస్ జగన్ అండగా నిలిచేందుకు వస్తుంటే సహించలేక పోతున్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం
పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. జిల్లా ఎస్పీతో మాట్లాడించిన మాటలు చూస్తే శాంతిభద్రతలను కాపాడే అధికారులు మాట్లాడే మాటలు కావు అవి. జగన్‌ను కలిసేందుకు వచ్చే వారిపై రౌడీషీటర్లు తెరుస్తామని ఎలా బెదిరిస్తారు? వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటాం, ఆయనను నిలదీస్తాం, ఆయనతో వాగ్వివాదంకు దిగుతామని హెచ్చరిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మాత్రం పోలీసులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా మాట్లాడకూడదంటూ కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా జిల్లా పోలీస్ అధికారులు చేయలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు హెచ్చరిస్తుంటే పోలీసులకు వినిపించడం లేదా? జిల్లా ఎస్పీతో ఇలా మాట్లాడిస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా, సీఎం చంద్రబాబు కాదా? రైతులను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. రైతులకు శిక్షణ కూడా ఇచ్చారంటూ మాట్లాడటం దారుణం’ అని ధ్వజమెత్తారు