బెంగాల్లో ఆడియో టేపుల కలకలం!

Bengal audio tapes Abhishek Banerjee Rs 35 crore cut money - Sakshi

మమత మేనల్లుడిపై ఆరోపణలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ఒక ప్రముఖ చానెల్‌ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. విచారణా సంస్థలకు సంబంధించిన వర్గాల నుంచి కొన్ని ఆడియో టేపులు సంపాదించినట్లు పేర్కొంది. ఈ టేపుల్లో సీఎం మమత మేనల్లుడు అభిషేక్‌ అక్రమంగా సొమ్ములు సేకరిస్తున్నట్లుంది. తొలి టేపులో కోల్‌ స్మగ్లింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనూప్‌ మాంఝీ సహచరుడు గణేశ్‌ బగారియా మాటలున్నాయి. రాష్ట్రంలో అవినీతి రాకెట్‌ ఎలా విస్తరించింది గణేశ్‌ వివరించాడు. రెండో టేపులో మమత రాజకీయంగా ఎదుగుతుంటే, అభిషేక్‌ ఎలా కిందకు లాగుతున్నది మాట్లాడుకున్నారు. మూడో టేపులో దాదాపు రూ. 45 కోట్ల కట్‌మనీ అభిషేక్‌ వద్దకు ఎలా చేరిందో చర్చించుకున్నట్లుంది. 4వ టేపులో మమతా గుడ్డిగా అభిషేక్‌ను నమ్ముతున్నారని ఉంది. చివరిటేపులో ఎక్సైజ్‌ కమిషనర్‌ను అభిషేక్‌ మిత్రుడు వినయ్‌ మిశ్రా లంచం అడగడం, కోల్‌మైనర్లను అభిషేక్‌ లంచం అడిగిన అంశం ఉన్నాయి.

బెంగాల్‌కే అవమానం!
మమత మేనల్లుడిపై ఆరోపణలు గుప్పిస్తూ విడుదలైన ఆడియో టేపులపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ, ఆమె బంధువులు పశ్చిమబెంగాల్‌ ప్రజలకు తలవంపులు తెచ్చారని విమర్శించింది. ప్రజలను మోసం చేసినందుకు మమత క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మమత ఇచ్చే రక్షణతో కొందరు చెలరేగిపోతున్నారని, బెంగాల్లో అవినీతి దందా నడుపుతున్నారని ఆరోపించింది. ఆడియో టేపుల వ్యవహారంపై టీఎంసీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మమత పాలనలో దోపిడీదారుల ధైర్యం ఇలాగుందని, ఒక సమావేశంలో అభిషేక్‌ బెనర్జీకి దగ్గరైన ఒక దోపిడీదారుడు కమిషనర్‌కు దగ్గరగా కూర్చుని అక్రమ డిమాండ్లు చేయడం ఎలాంటి సందేశమిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. మమతకు తెలిసే రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఆరోపించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top