బాబుకు బీసీలు బైబై | Sakshi
Sakshi News home page

బాబుకు బీసీలు బైబై

Published Fri, Feb 23 2024 4:36 AM

BC Community People Ready To Defeat Chandrababu In Elections - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ..! అంటూ బీసీలు ‘‘సిద్ధం’’ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా అక్కున చేర్చుకున్న వైఎస్సార్‌ సీపీ వెంట బీసీలు నడుస్తున్నారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉండే అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్‌ తాజాగా నిర్వహించిన సిద్ధం సభకు తరలివచ్చిన జనసందోహమే అందుకు నిదర్శమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల గడ్డ కుప్పంలో సైతం వలస నేత చంద్రబాబును తరిమేందుకు బలహీన వర్గాలు సిద్ధం కావడంతో సొంత సామాజిక వర్గాన్ని శరణు వేడుతూ చంద్రబాబు పక్క చూపులు చూడటాన్ని ఉదహరిస్తున్నారు.

‘కుప్పం’లో చొరబడి మూడున్నర దశాబ్దాలుగా పీడిస్తున్న చంద్రబాబు రాజకీయ జీవితానికి తెర పడటం ఖాయమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గత ఎన్నికల్లో గెలుపొందిన కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని ఇప్పటికే తేటతెల్లం చేశారు. కుప్పం నియోజకవర్గ ఓటర్లలో బీసీలే అత్యధికం. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంలో బీసీలే ప్రధాన భూమిక పోషించినట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.

దీంతో కుప్పం నుంచి మరోసారి బరిలోకి దిగితే రాజకీయ సమాధి తప్పదని పసిగట్టిన చంద్రబాబు పరువు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక తనకు విశ్రాంతి అవసరమని స్వయంగా భార్య ద్వారా చెప్పించడం ద్వారా చంద్రబాబు ఇప్పటికే ఓటమిని అంగీకరించి చేతులెత్తేశారు. సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకుంటూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సురక్షిత స్థావరాల కోసం అన్వేషిస్తున్నారు.

టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేస్తూ రాజకీయ అవసరాలు తీరాక ఆ వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బీసీలకు ఇచ్చిన హామీల కంటే మిన్నగా గత 58 నెలలుగా ముఖ్యమంత్రి జగన్‌ సామాజిక న్యాయం చేయడంతో ఆ వర్గాలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి విజయవంతం కావడంతో ఇది ప్రస్ఫుటితమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

తరిమిన ‘కోట’..
చంద్రబాబు 1978 ఎన్నికల్లో సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందగా 1983లో అక్కడ చిత్తుగా ఓడిపోయారు. ఆ వెంటనే టీడీపీ పంచన చేరిన చంద్రబాబు ఓటమి భయంతో 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్టీఆర్‌ అభిమానులు, బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్‌.రంగస్వామినాయుడు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో 1989లో కుప్పం వలస వెళ్లిన చంద్రబాబు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారి దొంగ ఓట్లను చేర్చి వరుసగా నెగ్గుకొస్తున్నారు.

అయితే ఇటీవల అధిక భాగం దొంగ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మరోవైపు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్, మున్సిపాల్టీగా చేసిన సీఎం జగన్‌ అభివృద్ధి బాట పట్టించారు. సంక్షేమ పథకాల ద్వారా కుప్పం వాసులకు మంచి చేస్తున్నారు. కుప్పం పరిధిలో మున్సిపాల్టీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 2,12,049 ఓట్లు ఉంటే 1,43,820 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీకి 99,586 ఓట్లు రాగా టీడీపీకి కేవలం 34,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి 65,351 ఓట్ల మెజార్టీ వచి్చనట్లు స్పష్టమవుతోంది.

గత ఎన్నికల్లో చంద్రబాబుకు లభించిన మెజార్టీ 30,722 ఓట్లు మాత్రమే. వీటిని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 34,629 ఓట్ల ఆధిక్యత లభించింది. తద్వారా చంద్రబాబు కోట ఇప్పటికే కుప్పకూలినట్లు స్పష్టమవుతోంది. కుప్పం నియోజక వర్గానికి కృష్ణా జలాలను తరలించే పేరుతో చంద్రబాబు నాడు ప్రభుత్వ ఖజానాను దోచేయగా ఇప్పుడు సీఎం జగన్‌ ఆ పనులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజలలో ఆదరణ మరింత పెరిగింది.  

తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా 
2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పో­కడలను చాటుకున్నారు.

న్యాయం చేయా­లని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితు­లను దారుణంగా అవమానించారు. బీసీ­లు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు.  

వెన్నుకు దన్నుగా
గత ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన దాని కంటే మిన్నగా 58 నెలలుగా ఆ సామాజిక వర్గాలకు సీఎం జగన్‌ గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల్లో డీబీటీతో పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేయగా రూ. 1,20,022.96 కోట్ల మేర బీసీలకే లబ్ధి చేకూరడం గమనార్హం. నాన్‌ డీబీటీ రూపంలో పలు వర్గాలకు రూ. 1.76 లక్షల కోట్ల వరకు మేలు జరగ్గా అందులో బీసీలకు రూ.50,657.39 కోట్ల దాకా ప్రయోజనం దక్కింది. డీబీటీ, నాన్‌ డీబీటీతో కలిపి రూ. 1,71,290.37 కోట్ల మేర బీసీలకు సీఎం జగన్‌ లబ్ధి చేకూర్చారు.  

రాజ్యాధికారంలో సింహభాగం..
సీఎం జగన్‌ మంత్రివర్గంలో 25 మంది ఉండగా అందులో 11 మంది బీసీలకే అవకాశం ఇచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను బలహీన వర్గాలకే అప్పగించి పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. బీసీ వర్గాలకు చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్‌ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారు.

స్థానిక సంస్థల్లో  వైఎస్సార్‌సీపీకి దక్కిన 13 జడ్పీ ఛైర్మన్‌ పదవులకుగానూ 6 బీసీలకే ఇచ్చారు. 84 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులకుగానూ 44 బలహీన వర్గాలకే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. దాంతో రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారతను బీసీలు సాధించారు. తమను అవహేళన చేసిన చంద్రబాబును ఛీకొట్టిన బీసీలు సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతున్న సీఎం జగన్‌ వెంట నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించగా 39 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఆ పార్టీ చరిత్రలో అదే ఘోర పరాజయం. సీఎం జగన్‌ అందిస్తున్న సుపరిపాలనతో బీసీలు వైఎస్సార్‌సీపీని అక్కున చేర్చుకుంటున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ సభలకు లక్షలాది మంది పోటెత్తగా వారిలో బీసీలే అత్యధికంగా ఉన్నట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. బీసీలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో మరో చారిత్రక పరాజయం తప్పదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.    

Advertisement
 
Advertisement