రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి

Bandi Sanjay Demanded Over Dalit Bandhu Implementation In Telangana State - Sakshi

బండి సంజయ్‌ డిమాండ్‌ 

అక్టోబర్‌ 2 నుంచి నియోజకవర్గాల్లో ఉద్యమాలు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు, ఇందుకోసం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్‌స్టేషన్లకు వస్తానని అన్నారు.

అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్‌ చేసుకుంటారన్నారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top