బెంగళూరు డ్రగ్స్‌ కేసు తిరగదోడతాం  | Sakshi
Sakshi News home page

బెంగళూరు డ్రగ్స్‌ కేసు తిరగదోడతాం 

Published Fri, Dec 2 2022 1:26 AM

Bandi Sanjay Comments On CM KCR In Praja Sangrama Yatra Nirmal - Sakshi

నిర్మల్‌: ‘సంచలనం రేపిన బెంగళూరు డ్రగ్స్‌ కేసులోనూ కేసీఆర్‌ కుటుంబ పాత్ర ఉంది. కర్ణాటక పోలీసులను సైతం కేసీఆర్‌ మేనేజ్‌ చేశాడు. కేసును మూసేయించాడు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కేసు మూసేందుకు సహకరించిన పోలీసు అధికారుల సంగతి, దీని వెనుక ఉన్న కేసీఆర్‌ సంగతి తేల్చాల్సిందే.

ఈ కేసును తిరగదోడే దాకా విడిచిపెట్టం. కేసీఆర్, కవితలు ఇప్పటికే దొరికిపోయారు. ఇక కేటీఆర్‌ సంగతి చూస్తాం. మొత్తం కేసీఆర్‌ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంటూ, వేల కోట్లు లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి దందాలు చేసేవాళ్లని విడిచిపెట్టం..’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర గురువారం నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం లింబా(బి), ఓలా, కుంటాల, అంబకంటి గ్రామాల్లో సాగింది. లింబా(బి)లో పాఠశాల, ఓలా వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కాలువను సంజయ్‌ పరిశీలించారు. పలుచోట్ల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

రాష్ట్రాన్ని దివాలా తీయించారు.. 
‘ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించిన కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి లేని డబ్బులు, ఢిల్లీ లిక్కర్‌ దందాకు, క్యాసినోలో పెట్టుబడులకు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెరుగుతుంటే, పేదోళ్లు బికారులు అవుతున్నారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల అప్పు ఉంది..’అని సంజయ్‌ విమర్శించారు.  

పైసలన్నీ కేంద్రానివే..  
‘మహిళల గౌరవాన్ని కాపాడేందుకు స్వచ్ఛ భారత్‌ కింద టాయిలెట్లు నిర్మించడం మొదలుకుని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనేదాకా గ్రామంలో ప్రతి అభివృద్ధి పనికి కేంద్రమే పైసలిస్తోంది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం రూ.4 వేల కోట్లను మోదీ ఇస్తే కేసీఆర్‌ ఏం చేశాడు. రైతుబంధు ఇస్తున్నామని చెప్పి మిగిలిన పథకాలన్నీ ఎత్తేశాడు. పోడు భూములు, దళితబంధు, దళితబస్తీ హామీలు ఏమయ్యాయి? మిషన్‌ భగీరథపై కేటీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే. ఇక్కడ ఇళ్లు, నీళ్లు, రోడ్లు లేవు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ టిల్లుకు తెలిసేలా యువత ట్వీట్‌ చేయాలి. రాష్ట్రంలో ఊరూరా కేసీఆర్‌ (బెల్ట్‌) షాపులు ఉన్నాయి. చిన్నపిల్లలకు సైతం డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నారు..’అని ఆరోపించారు.  

యువకుల బలిదానాలతోనే తెలంగాణ 
‘కేసీఆర్‌ చేసిన దొంగ పోరాటాలతో తెలంగాణ రాలేదు. శ్రీకాంతాచారి, పోలీస్‌ కిష్టయ్య, సుమన్‌ వంటి 1,200 మంది యువకుల బలిదానాలతో వచ్చింది. కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలతోపాటు సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో రామరాజ్యం స్థాపించి తీరుతాం..’అని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీ సోయం బాపురావు, పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement