వైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ

Balineni Srinivasa Reddy comments on TDP - Sakshi

ఇన్నేళ్లలో ఏ ఒక్క ఆర్యవైశ్యుడైనా నా వల్ల బాధపడ్డారా!

అందరి సంతోషం, సంక్షేమమే నాకు ముఖ్యం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు/ఒంగోలు సబర్బన్‌: ఆర్యవైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ నాయకులు, వారికి మద్దతుగా పనిచేస్తున్న కొన్ని చానళ్లు కంకణం కట్టుకున్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమిశెట్టి సుబ్బారావు (గుప్తా) ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు తమ పార్టీలోనే కొందరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో వారు కొంత తొందరపడ్డారని చెప్పారు. ఆ విషయం తన దృష్టికి రాగానే వాళ్లని నిలువరించానని చెప్పారు. ఆ తరువాత సుబ్బారావు తమతోనే ఉన్నారన్నారు. ‘అసలు టీడీపీ వాళ్లకు ఏమిటి బాధ. వీళ్లకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మమ్మల్ని అభాసుపాలు చేయాలన్నదే టీడీపీ నాయకులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ పనిగా పెట్టుకుని కుయుక్తులు పన్నుతున్నారు’ అని ధ్వజమెత్తారు. 

‘రాజకీయ సన్యాసం తీసుకుంటా’
‘ఐదుసార్లు ఒంగోలు శాసనసభ్యునిగా ఎన్నికయ్యా. ఇన్నేళ్లలో నా వల్ల ఏ ఒక్క ఆర్యవైశ్యుడైనా బాధపడ్డారా. వైఎస్సార్‌ సీపీలోనే కాదు. చివరకు టీడీపీ, జనసేనలో ఉన్న వారినీ అడుగుతున్నా. ఎవరైనా బాధపడి ఉంటే చెప్పండి. రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని మంత్రి బాలినేని అన్నారు. ‘నాకు స్నేహితుడి వంటి వ్యక్తి అతని వ్యాపారం నిమిత్తం డబ్బుతో చెన్నై వెళ్తుంటే ఆ డబ్బులు నావంటూ హవాలా మంత్రి అని మీడియా ప్రచారం చేసింది. ఆ డబ్బు ముమ్మాటికీ నల్లమల్లి బాలు అనే వ్యక్తికి చెందినదనే విషయం ఆర్యవైశ్యుల్లో అందరికీ తెలుసు.

ఇప్పుడు సుబ్బారావుగుప్తాపై ఓ కార్యకర్త దాడిచేస్తే దానిపై నేను స్వయంగా కేసు పెట్టించాను. అరెస్ట్‌ కూడా చేయమని కోరాను. ఈ దాడికి, బాలినేనికి సంబంధం లేదని స్వయంగా సుబ్బారావే చెప్పినా మీడియాలో విష ప్రచారం చేయడం దారుణం’ అని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాట్లాడినా, మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెట్టినా అందరి సంతోషం, సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. గతంలో వ్యాపారి పత్తి రామకృష్ణ మరణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం కారణమైతే.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న మీడియా అప్పుడేమైందని ప్రశ్నించారు.

తాను మౌనంగా ఉంటున్నానని ఇష్టం వచ్చి నట్లుగా విమర్శలు చేస్తుండటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. భౌతిక దాడులను సహించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లాతో ఉన్న బంధం విడదీయరానిదని మంత్రి బాలినేని అన్నారు. ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివ ర్గంలో తాను ఒక మంత్రినని, ఈ నేపథ్యంలో ఆయన రుణం కొంతైనా తీర్చుకునేందుకు ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఏ స్థలంలో రోశయ్య విగ్రహాన్ని పెడితే బాగుంటుందో వారం రోజుల్లో సూచించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top