రెండున్నరేళ్లలో బోడో ఒప్పందం అమలు  | Assam Elections: Bodo Accord Will Be Implemented Within 30 Months, Says Amit Shah | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో బోడో ఒప్పందం అమలు 

Mar 23 2021 3:35 PM | Updated on Mar 23 2021 3:45 PM

Assam Elections: Bodo Accord Will Be Implemented Within 30 Months, Says Amit Shah - Sakshi

ఉడల్‌గురి: తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో బోడో ఒప్పందంలోని అన్ని క్లాజులను సంపూర్ణంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. బోడోలాండ్‌ టెరిటోరియల్‌ రీజియన్‌(బీటీఆర్‌)లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గతేడాది ప్రధాని బోడో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కాల్పుల విరమణ, ఈప్రాంత సర్వతోముఖాభివృద్ధి ఆరంభమయ్యాయన్నారు. బోడో ప్రాంతాల్లో శాంతి తమ ఉద్దేశమని, తిరిగి అధికారంలోకి వస్తే ఒప్పందం సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పారు.

బోడో యువత తుపాకుల బదులు కంప్యూటర్‌ను ఎంచుకోవచ్చని, దేశాభివృద్ధికి దోహదపడవచ్చని చెప్పారు. ప్రధాని చొరవతోనే ఈ ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయంలో బోడో ఘర్షణల్లో దాదాపు 5వేల మంది మరణించారని, కానీ కాంగ్రెస్‌ నేతలు స్వీయప్రయోజనాలు చూసుకుంటూ పబ్బం గడిపారని విమర్శించారు. కాంగ్రెస్‌ తాజాగా ఏర్పరిచిన మహాకూటమి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురాలేదన్నారు. ఇప్పటికే బోడోల కోసం 65 పథకాలను ప్రకటించామన్నారు. 

రాహుల్‌ పిక్నిక్‌కు వచ్చారు 
ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ జరిపిన అసోం పర్యటనపై అమిత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన రాష్ట్రానికి పిక్నిక్‌కు వచ్చినట్లు వచ్చిపోయారన్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్‌ టీ వర్కర్లకు చేసిందేమీలేదని, రాహుల్‌ మాత్రం ఫొటోలుదిగిపోయారని ఎద్దేవా చేశారు. టీ వర్కర్లకు బీజేపీ చేసిన మేలును ఆయన వివరించారు. బీజేపీ మాత్రమే అసోంను కాపాడగలదని చెప్పారు. ఏఐయూడీఎఫ్‌ను చెంత చేర్చుకొని అసోంలో కాంగ్రెస్‌ ఎలా శాంతిని తెస్తుందని ప్రశ్నించారు. బద్రుద్దీన్‌ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలోకి మరింత మంది వలసదారులు వస్తారన్నారు. తమ ప్రభుత్వం అసోంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement