జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

AP HC Division Bench Gave Green Signal To Conduct ZPTC And MPTC Election - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న రిట్‌ పిటిషన్‌ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ముందున్న రిట్‌ పిటిషన్‌ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

ఎన్నికలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే వర్ల రామయ్య రిట్‌ పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి అనుమతినిచ్చినట్లయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి సింగిల్‌ జడ్జి వద్ద రిట్‌ పిటిషన్‌ అపరిష్కృతంగా ఉందని తెలిపింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా సింగిల్‌ జడ్జి తుది తీర్పునిచ్చినట్లయిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల సందర్భంగా నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయలేదన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వర్ల రామయ్య ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశంపై సింగిల్‌ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని వివరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలున్నాయని, వీటన్నింటిపై రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తేల్చాల్సి ఉందంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఎస్‌ఈసీ అప్పీల్‌...
పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తోందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందుగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అందుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ ఎన్నికల నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కె.కన్నబాబు మంగళవారం రాత్రి అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉదయం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. 
ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఓటర్లు, ప్రజల కోసం వ్యక్తిగత హోదాలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది అంగీకరించారు. దీనిపై మేం సింగిల్‌ జడ్జి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాం. వర్ల రామయ్య పిటిషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకు వస్తుందని, దాన్ని ధర్మాసనమే విచారించాలని కోరాం. అయితే సింగిల్‌ జడ్జి మా వాదనను పట్టించుకోలేదు. ఎన్నికల నియమావళి అమలు విషయంలో ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారాలున్నాయి. అసలు ఎన్నికల నియమావళికి చట్టపరమైన దన్ను ఏదీ లేదు. ప్రతి ఎన్నికకు 4 వారాల పాటు నియమావళిని అమలు చేయాల్సి వస్తే మూడు నాలుగు నెలల పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోతుంది. గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియను 28 రోజుల్లో పూర్తి చేశాం. పురపాలక ఎన్నికలను 24 రోజుల్లో పూర్తి చేశాం. అయితే ఇంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో 30 రోజుల ఎన్నికల నియమావళిని అమలు చేయలేదు. అప్పుడు ఎవరూ దీన్ని సవాలు చేయలేదు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక అందు లో ఏ రకంగానూ జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు చెప్పింది. సమయాభావం వల్ల పూర్తి స్థాయి కౌంటర్‌ వేయలేకపోయాం. ప్రాథమిక కౌంటర్‌ దాఖలు చేశాం. గురువారం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందువల్ల ఎన్నికలను కొనసాగనివ్వండి’అని ధర్మాసనాన్ని సీవీ మోహన్‌రెడ్డి అభ్యర్థించారు. 

కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే...
వర్ల రామయ్య తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘ఈసీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. హైకోర్టు ఆదేశాలు అయినా, సుప్రీంకోర్టు ఆదేశాలు అయినా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. తమకు అర్థమైన రీతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటే కుదరదు. ఎన్నికల తేదీకి ముందు 4 వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పినట్లుగా అమలు చేసి తీరాల్సిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 10 రోజులు మాత్రమే  నియమావళిని అమలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో 4 వారాల నియమావళి అమలు కాలేదు...
చివరగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోనే ఉంది. గత ఎన్నికల్లో నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళి అమలు కాలేదు. కోవిడ్‌ వల్ల ఎన్నికలు ఆపేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికల నియమావళిని ఎత్తివేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్తంభించిపోతాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. దీంతో ఎన్నికలు లేనప్పుడు నియమావళి అమల్లో ఉండరాదంటూ దాన్ని సడలించింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని సూచించింది. అయితే ఈ నాలుగు వారాలన్నది గరిష్ట కాల పరిమితి. అంతేకానీ నిరవధికంగా నియమావళి ఉండాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదు. ఈ ఎన్నికలు పూర్తయితే కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు చెప్పింది. ఈ కేసులో కూడా సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకుని ఉండాల్సి కాదు’అని నివేదించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ యథాతథంగా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది.  

చదవండి: నిమ్మగడ్డ నిర్వాకంతోనే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top