
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరోసారి రెచ్చిపోయారు. తన వయసును, అనుభవాన్ని మర్చిపోయి సభాధ్యక్షుడిపైనే బెదిరింపులకు పాల్పడ్డారు. శీతాకాల సమావేశాలల్లో భాగంగా మంగళవారం ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంను అవమానించేలా మాట్లాడారు. స్పీకర్ వైపు వేలు చూసిస్తూ మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. చేతిలో పేపర్లు స్పీకర్ వైపు విసిరేశారు. చంద్రబాబు తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడేది లేదంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.
చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి
స్పీకర్ పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని, సభలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ప్రజల ఇచ్చిన తీర్పు ప్రకారమే సభలో మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.