
శనివారం చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభకు హాజరైన జనం, సభలో మాట్లాడుతున్న ఖర్గే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని బీఆర్‌ఎస్, దేశంలోని బీజేపీ రెండు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, అందులో కేసీఆర్ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి.. తీరా ఫొటో తీసుకుని బయటికి వచ్చాక మాట మార్చారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని చెప్పారు. శనివారం చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వేదికపై ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగించారు.
మోడీ హఠావో.. బీజేపీ హఠావో
ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని.. తాజాగా చైనా సరిహద్దుల్లోనూ బైక్‌పై పర్యటించారని ఖర్గే చెప్పారు. అలాంటి నేతపై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా, నియంతలా వ్యవహిస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాహుల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని.. అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. ‘మోదీ హఠావో.. బీజేపీ హఠావో’ అని పిలుపునిచ్చారు.
53ఏళ్ల పాలనలో ఎంతో చేశాం
దేశంలో మహిళలు, గిరిజనులు, ఆదివాసులకు రక్షణ లేకుండా పోయిందని, అనేక మంది పేద విద్యార్థులు కనీస తిండికి నోచుకోలేక పోతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని తీసుకొచ్చిందని.. పేదలకు పని కల్పించేందుకు ఉపాధి హామీ, గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెచ్చిందని గుర్తు చేశారు.
దేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ప్రతి ఒక్కరి చేతుల్లోకి సెల్‌ఫోన్లు రావడానికి రాజీవ్ గాం«దీయే కారణమని వివరించారు. ఈ సమయంలో కార్యకర్తలతో చేతుల్లోని ఫోన్లను పైకెత్తించి, టార్చిలైట్లు వెలిగించాలని కోరారు. ఇక ఇందిరాగాం«దీ, రాజీవ్æ గాంధీ దేశం కోసం అహర్నిశలు శ్రమించి, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని ఖర్గే చెప్పారు.
హరిత విప్లవం, నీలి విప్లవం తెచ్చాం
కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక విప్లవంతోపాటు నీలి విప్లవం, హరిత విప్లవాలనూ తీసుకొచ్చిందని ఖర్గే వివరించారు. పారిశ్రామిక విధానంతో ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి, అనేక మందికి ఉపాధి కల్పించిందని చెప్పారు. నాగార్జునసాగర్ వంటి భారీ బహుళార్థక ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని.. బ్యాంకులను జాతీయీకరణ చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏం చేశాయని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే.. నేటి మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసి, వాటి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యత పెరిగితే.. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఘోరంగా పడిపోయిందని విమర్శించారు.
బయట తిట్టుకుని.. లోపల మంతనాలా?
సీఎం కేసీఆర్ బయటికి మోదీని తిడుతూ, లోలోపల మంతనాలు జరుపుతున్నారని ఖర్గే విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు బలపడాలన్నా.. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాలన్నా ఈ రెండు పార్టీలను ఇంటికి పంపాల్సిందేనని పేర్కొన్నారు.