పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే.. 

AAPs CM Face In Punjab Will Be a Sikh: Arvind Kejriwal - Sakshi

అమృత్‌సర్‌: 2022లో పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తే ఉంటారని పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, నిర్ణయం తీసుకోగానే చెబుతామని అన్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి కున్వర్‌ విజయ్‌ ప్రతాప్‌సింగ్‌... కేజ్రీవాల్‌ సమక్షంలో ఆప్‌లో చేరారు. ఆప్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితవర్గం నుంచి ఎవరైనా ఉంటారా? అంటూ మీడియా ప్రశ్నించింది.

కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ప్రకటించబోయే వ్యక్తి వల్ల యావత్‌ రాష్ట్రం గర్విస్తుందని, ఆ వ్యక్తి సిక్కువర్గం నుంచి ఉంటారని స్పష్టం చేశారు. విజయ్‌ ప్రతాప్‌సింగ్‌ ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో చర్చలు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా... ‘సిద్ధూ కాంగ్రెస్‌ నేత అని, సీనియర్‌ నాయకుడు. ఆయన్ను నేనెంతో గౌరవిస్తాను. అందువల్ల ఏ నేత గురించీ అనవసర మాటలొద్దు. ఒకవేళ సిద్ధూతో భేటీ అయితే, ముందుగా ఆ విషయాన్ని మీడియాకే చెబుతా’నని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top