కోల్‌సిటీ: రామగుండంలోని మొర్మూర్ మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద స్టార్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మోటార్లు పనిచేయడం లేదు. దీంతో రామగుండం నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం నీటి సరఫరా జరగాల్సిన ప్రాంతాలకు మంగళవారం, మంగళవారం సరఫరా కావాల్సిన ప్రాంతాలకు బుధవారం నీటిని అందించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకుని సహకరించాలని కోరారు.
సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను సోమవారం జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి రాంరెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్, సురేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలోని అంశాలను శాసీ్త్రయ దృక్పథంతో విశ్లేషించాలని సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పరీక్షలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ జనగామ శ్రీవిష్ణు, జిల్లా ఉపాధ్యక్షుడు అరెల్లి లక్ష్మణ్, కార్యదర్శులు కె.లక్ష్మణ్, తీట్ల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ కుటుంబాన్ని దూషించారని ఆందోళన
మంథనిరూరల్: మండలంలోని పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుటుంబసభ్యులను నగరంపల్లి ఉపసర్పంచ్ భర్త తిరుపతిరెడ్డి అసభ్యపదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ దళిత కుల సంఘాలు గ్రామ సమీపంలోని మంథని–పెద్దపల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. దీపావళి సందర్భంగా పుట్టపాక సర్పంచ్ కుమారుడు బైక్‌పై ఇంటికి వస్తుండగా వెనకాలే నగరంపల్లి ఉపసర్పంచ్ భర్త తిరుపతిరెడ్డి కారులో వస్తూ ఢీకొట్టేందుకు ప్రయత్నించాడని, ఈ విషయమై కారులో ఉన్న మరో వ్యక్తితో మాట్లాడుతుండగా తిరుపతిరెడ్డి సర్పంచ్ కుటుంబాన్ని దూషించాడని ఆరోపించారు. సుమారు 2 గంటల పాటు ధర్నా చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ స్వామి, ఎస్సై సందీప్, సిబ్బంది అక్కడకు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, తనకు తన కుటుంబానికి ఉపసర్పంచ్ భర్త తిరుపతిరెడ్డితో ప్రాణభయం ఉందని పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాబు ఆరోపించారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెర్క శ్యాం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లికి చెందిన పెర్క శ్యాంను కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం పార్టీ మీడియా కమిటీ చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌కు శ్యాం కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడతానని పేర్కొన్నారు.


