● ఎల్‌నినోను అధిగమించేందుకు చర్యలు ● తక్కువ నీరు, తక్కువ కాలపరిమితి పంటలే మేలంటున్న అధికారులు
పెద్దపల్లిరూరల్: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు తక్కువ నీటిని వినియోగిస్తూ తక్కువ కాలపరిమితి గల పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో వర్షాభావ పరిస్థితులు అధికం అయ్యే అవకాశమున్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీనీటి బొట్టును ఒడిసిపట్టి పంటను కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలని పేర్కొంటున్నారు.
బిందు సేద్యమే బెటర్
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్న తరుణంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అందుకు బిందుసేద్యం(డ్రిప్) తుంపరసేద్యం (స్ప్రిక్లర్) పద్ధతులను వినియోగిస్తూ ప్రతీనీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా రైతులు సాగు మెలకువలను పాటించాలన్నారు. తమకు అందుబాటులో ఉన్న నీటి లభ్యతను బట్టి పంట విస్తీర్ణాన్ని నిర్ణయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. నేలలో తేమ శాతాన్ని పరిశీలిస్తూ అవసరమైన మేరకు నీరందేలా చర్యలు చేపట్టాలని వివరిస్తున్నారు.
కూరగాయల సాగే మేలు
వర్షాభావంతో తక్కువ నీటితో మంచి దిగుబడులను సాధించడంతో ఆదాయం పొందేందుకు కూరగాయల సాగు చేయడమే మేలని ఉద్యాన అధికారులు వివరిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో మంచిదిగుబడులు, ఆదాయం పొందే వంకాయ, మునగ, గోరుచిక్కుడు, బెండ, అలసంద, చిలగడదుంప లాంటి కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు. నీటి లభ్యత లేకున్నా ఎక్కువనీరు అవసరమయ్యే పంటలు సాగు చేస్తే దిగుబడి రాక పెట్టుబడులను నష్టపోయే ప్రమాదముంటుందని పేర్కొంటున్నారు


