సాక్షి, పెద్దపల్లి:
పత్తి పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈసారి నిరాశే మిగులుతోంది. ఒకవైపు సకాలంలో వర్షాలు కురవక మొక్కల ఎదుగుదల మందగించగా.. మరోవైపు పూత, కాత దశలో ఎండల తీవ్రత, తెగుళ్లు, దోమకాటు పంటను దెబ్బతీశాయి. దీంతో పత్తి మొక్కలు ఎర్రబారి, పూత, కాయలు రాలిపోతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.40 వేలకుపైగా పెట్టుబడి పెట్టినా కనీసం పెట్టిన ఖర్చులైనా చేతికొస్తాయో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
జిల్లాలో గతేడాది 52,450 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 51,246 ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలం ప్రారంభం నుంచే వర్షాల కొరత పంట ఎదుగుదలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మొక్కలు రెండు అడుగుల ఎత్తుకు మించి పెరగలేదు. దీంతో పూత, కాత తగ్గిపోయాయి. ఒక్కో మొక్కకు రెండు, మూడు కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. పంట పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆశించిన రైతులకు గత నెల చివరి వారంలో కురిసిన వర్షాలు, ఆ తర్వాత వాతావరణ మార్పులు మరింత ఇబ్బందులకు గురిచేశాయి. లోతట్టు ప్రాంతాల్లో తెల్లదోమ, పచ్చదోమ ఉధృతి కూడా పంటపై ప్రభావం చూపింది. పూత రాలిపోవడం, కాయలు సరిగా అభివృద్ధి చెందకపోవడంతో దిగుబడిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
దిగుబడి దిగజారి
సాధారణంగా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించే రైతులకు ఈసారి కనీసం రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పంటను కాపాడుకునే పరిస్థితి లేక కొందరు రైతులు సాగును వదిలేస్తుండగా.. మరికొందరు పత్తి మొక్కలను తొలగించి మొక్కజొన్న సాగుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు పత్తి పంటతో పెట్టుబడి పోను ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు ఈసారి కనీసం ఖర్చులు కూడా తిరిగి వస్తాయో లేదోనన్న ఆందోళన పట్టుకుంది. వర్షాభావ పరిస్థితులు, పంట ఎదుగుదల లోపం, తెగుళ్లు, దోమకాటు కలిసి రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తమకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


