జ్యోతినగర్: ఎన్టీపీసీలో ప్రణవం సదనం సంస్కృతి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర ప్రారంభానికి ముందు కాశీనుంచి వచ్చిన బ్రాహ్మణులతో గంగా హారతి నిర్వహించారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రులు, సమాజానికి మంచి పేరు తీసుకరావాలని సూచించారు. డీసీసీ అధికార ప్రతినిధి పెండ్యాల మహేశ్, ఎన్టీపీసీ ఎస్సై వెంకటస్వామి, ఎస్సై స్రవంతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేశ్, పీఎస్‌ఎస్‌వై బాధ్యులు, హిందూవాహిని నాయకులు, భవాని మాలధారులు, భక్తులు పాల్గొన్నారు.
రీ సర్వే ప్రక్రియ
వేగవంతం చేయాలి
పెద్దపల్లి: భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైకోర్టు భూ వివాదాల కేసులు, జీవో59, 76 కింద పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే త్వరగా పూర్తయ్యేలా ప్రతీ మండలానికి రెండు సర్వే బృందాలను కేటాయించాలని అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఆదేశాల మేరకు జిల్లాలో పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్‌డీవోలు గంగయ్య, సురేశ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి బి.ప్రకాశ్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ గ్రామసభ
రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య నిర్మిస్తున్న వంతెన నిర్మాణం కోసం గురువారం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో భూసేకరణ గ్రామసభ నిర్వహించారు. పెద్దపల్లి భూసేకరణ అధికారి, అధికారి గంగయ్య మాట్లాడుతూ 4.34 ఎకరాల విస్తీర్ణంలో భూమి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భూములు కోల్పోతున్న వారి వివరాలను వెల్లడిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీసుబోర్డుపై అంటించాలని ఆదేశించారు. ఏమైన అభ్యంతరాలు ఉంటే పక్షం రోజుల్లో అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ ఆముల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కొల్లూరి నవీన్, అంతర్గాం తహసీల్దార్ పడాల ప్రసాద్, ఆర్‌ఐ గుంట రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీహెచ్‌సీ తనిఖీ
ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్‌సీ) గురువారం పెద్దపల్లి డీసీహెచ్‌వో శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పారిశుధ్య స్థితిగతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నకల్వల సొసైటీ సందర్శన
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) అధికారులు గురువారం సందర్శించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాపారాలు, రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, చిరువ్యాపారులకు ఇచ్చే రుణాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్, గోదాంలు, పెట్రోల్ బ్యాంక్‌లను పరిశీలించి వివరాలను సేకరించారు. సంఘం కార్యకలాపాల గురించి పీఏసీఎస్ డెవలప్‌మెంట్ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, సొసైటీ చైర్‌పర్సన్ మురళీధర్‌రావు, సంఘం కార్యదర్శి వ ల్లకొండ రమేశ్‌లు తెలియజేశారు. డీసీసీబీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


