దసరా రోజు 108 సిబ్బంది సేవలు ఇలా
మొత్తం 250 కేసులు అటెంప్ట్ చేసిన 108 సిబ్బంది ఉమ్మడి జిల్లాలో దసరా రోజు 65 రోడ్డు ప్రమాదాలు అందులో అధికశాతం డ్రంకెన్ డ్రైవ్ కేసులే
విధుల్లో ఉంటేనే సంతృప్తి
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ప్రజలంతా దసరా సంబరాల్లో మునిగితేలుతుంటే.. 108 సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడే విధుల్లో నిమగ్నమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన సమయంలోనూ అత్యవసర ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ, ప్రమాద సమాచారం అందగానే క్షణాల్లో ఘటనా స్థలాలకు చేరుకుంటూ బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకోగా.. 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు సకాలంలో చేర్చారు.
ఉమ్మడి జిల్లాలో 108 సేవలిలా
దసరా రోజున కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కలిపి మొత్తం 257 కేసులకు 108 సిబ్బంది స్పందించారు. వీటిలో 64 రోడ్డు ప్రమాద కేసులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 82 కేసులు నమోదు కాగా, వాటిలో 25 రోడ్డు ప్రమాద కేసులు ఉన్నాయి. జగిత్యాలలో 60 కేసులకు గాను 11 రోడ్డు ప్రమాద కేసులు, పెద్దపల్లిలో 58 కేసులకు గాను 16 రోడ్డు ప్రమాద కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 కేసులకు గాను 12 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి.
డ్రంకెన్ డ్రైవ్‌తోనే అసలు ముప్పు
దసరా అంటే ఆనందం, ఆత్మీయత, కుటుంబ సమ్మేళనం. అయితే ఈ ఆనందాన్ని కొందరు మద్యం మత్తులో ప్రమాదకరంగా మార్చుకుంటున్నారు. పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రహదారులపై ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు వచ్చిన గణాంకాలు కూడా పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమైన తప్పిదం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లా మొత్తం రోడ్డు కేసులు ప్రమాదాలు
కరీంనగర్ 82 25
జగిత్యాల 60 11
పెద్దపల్లి 58 16
రాజన్నసిరిసిల్ల 57 12
మొత్తం 257 64
108 సిబ్బందికి పండుగలు, సెలవులను కుటుంబాలతో గడిపే అవకాశం చాలా తక్కువ. వారంతా విధుల్లో ఉండి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడినప్పుడే సంతృప్తిగా ఉంటారు. పండుగ వేళ మద్యం సేవించి ప్రమాదాల బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యానికి ప్రాధాన్యమివ్వడం తగ్గిస్తే కుటుంబాలతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది.
– భూమానాగేందర్, 108 ప్రోగ్రాం మేనేజర్


