● పండుగ పూట.. పూలు చెప్పే మాట ● ఎండుతున్న పొలాలు ● వలసపోతున్న యువకులు ● బరువెక్కిన బతుకమ్మ గుండె
సిరిసిల్ల ●:
అప్పుడే తెల్లారుతోంది. పొగమంచు కమ్ముకుంది. కోడి కూసింది. సూర్యుడి లేత కిరాణాలు భూమిని తాకుతున్నాయి. మంచు బిందువులు పసిడివర్ణంలో మెరుస్తున్నాయి. ఊరు నిద్రలేస్తోంది.
అది కాదు రా.. నువ్వు జెల్ది లెవ్వాలే తల్లీ. బతుకమ్మ పండుగ రోజు కూడా నువ్వు లెవ్వకుండా మొద్దు నిద్రపోతే ఎలాగమ్మా.. అంటూ కొంచెం బుదగరించింది భూమాత. ఆ మాటలతో దిగ్గున లేచి కూర్చుంది తంగేడు. నిజమే అమ్మా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేను తెలంగాణ పల్లెల్లో పూజలందుకుంటాను. కానీ, ఎందుకో ఈసారి నాకు ఆ పండుగకు వెళ్లబుద్దిగా లేదు అమ్మ. పల్లెల్లో పండుగ అన్న మాటే కానీ, ఆ పండుగ కళ లేనేలేదు. అదేదో ఎల్నినో వచ్చిందంటా నిన్ను నమ్ముకున్న రైతులు సంతోషంగా లేరు. కాలం లేదు. ఏ ఊరికెళ్లినా ఎండిన పొలం కథ.. వాడిన పత్తి ముచ్చట్లే వినిపిస్తున్నయి. ఊరందరికీ ఆధారమైన చెరువులు నిండలే. నీరు లేకుంటే పండగే ఉండదుగదమ్మా అంది తండేడు.
నిజమే తల్లి నువ్వు చెప్పేవన్నీ అక్షర సత్యాలు. మన చేతిలో ఏం ఉంది. భూమాతనైన పాపానికి భరిస్తున్నా. రైతుల కష్టాలు, నేతన్నల శ్రమ, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, కరెంట్ కష్టాలూ చూస్తున్నా. ఏం చేయలేని అసహాయ స్థితిలో ఉన్నాను రా బంగారం. అయినా బతుకమ్మ పండుగ పూట ఊరిలోకి పో అంటే.. గిన్ని ముచ్చట్లు దేనికి అంది భూమాత.
అబ్బో పండుగ.. పండుగ అంటున్నావు. ఉన్నోళ్లకు పండుగ. లేనోళ్లకు ఏం పండుగ అమ్మ. ఇంతెందుకు నాలాంటి పూల మోముల్లోనూ నవ్వే లేదు. పండుగ పూట ఇంట్లోని వాళ్లకు కొత్తబట్టలు కొనియ్యలేక.. పెరిగిన ధరలతో ఎందరో పేదలు దిక్కులు చూస్తుండ్రు. చేతిలో డబ్బుల్లేక ఎక్కడన్నా అప్పు చేద్దామన్నా.. గతంలో చేసినవి వెక్కిరిస్తున్నయి. ఏ మొఖం పెట్టుకుని బతుకమ్మ పండుగ అంటూ వాళ్ల ఇళ్లకు వెళ్లాలమ్మా అంటూ చెప్పింది తంగేడు. ఆ మాటలతో పుడమితల్లి గుండెలు గుభేల్మన్నాయి. ఒక్కసారి గతాన్ని తలచుకుని వాస్తవాలను నెమరువేసుకుంటూ.. భూమాత దిక్కులు చూస్తుంది.
మళ్లీ ఆలోచనలతో పడ్డదీ భూమాత. ఒకప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇంటి నిండా కొత్తగా వచ్చిన పంటలు, పెసర్లు, బబ్బెర్లు, మక్కలు తీరొక్క పంటలతో రైతుల ఇళ్లు ఎంత కళగా ఉండేవి. ఇంటికి వచ్చే ఆడబిడ్డలు, పిల్లాపాపలతో పల్లెంతా సందడిగా ఉండేది. పట్టువస్త్రాలు, పసిడి కొనుగోళ్లు, వెండి పట్టగొలుసులు చేయించుకోవడం.. ఒక్కటేమిటీ.. ఆడబిడ్డల పండుగ అంటూ ఊరూ.. వాడ మురిసేది. మరి ఇప్పుడు.. ఆ మురిపెం ఏమైంది. ఆ ఉత్సాహం ఊసే లేదు.. అంటూ భూమాత నిట్టూర్చింది.
అమ్మా ఏం ఆలోచిస్తున్నవే అంది తంగేడు. ఏం లేదమ్మా నువ్వన్న మాటలనే తల్చుకుంటున్నా అంటూ పక్కనే ఉన్న గునుగును పలకరించింది పుడమి తల్లి. అరేయ్ నువ్వన్నా తొందరగా తయారై.. ఊరిలోకి వెళ్లు. నీతో బతుకమ్మను పేర్చేందుకు అమ్మలక్కలంతా సిద్ధంగా ఉన్నారంది.
‘అమ్మా అంత తొందరేం లేదులే. ఎవరూ నా కోసం ఎదిరిచూస్తలేరు. బతుకమ్మ పండుగ అన్న మాటేకానీ మునుపటి ఉత్సాహమే లేదు. కరెంట్ సక్కంగ రాక.. మోటార్లు కాలిపోయి రైతన్నలు.. యాసంగిలో వరి వేయొద్దని అధికారులు, సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని ఉన్నా.. బీమా లేని దిగులు. రాష్ట్రంలోని ఏకై క టెక్స్టైల్పార్క్లో పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్కో పరిశ్రమ అమ్ముడుపోతుంది. వేల మంది కార్మికులంటే ఆ పార్క్ పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడింది. విద్యుత్ సబ్సిడీ సమస్యలతో సిరిసిల్ల కార్ఖానాలు మూతపడ్డాయి. మధ్యమానేరు నిర్వాసితులు ఇంకా పరిహారం కోసం అందక పరితపిస్తున్నారు. ఎందరో యువకులు ఊరిలో ఉపాధి లేక దుబాయి, మస్కట్ పోయిండ్రు. కొందరిని అయితే పని కోసం తీసుకెళ్లి రష్యాలో సైన్యంలో చేర్చారంటా! భూమిలేని కూలీలు పని కోసం లేబర్ అడ్డాలల్లా కూసున్నరు. బీడీ కార్మికులకు చేతినిండా పని లేదని పత్తి చేన్ల పొంటి కై కిలిపోతుండ్రు. ఎల్నినో ప్రభావంతో వేసవిలో నీళ్లు దొరకని దుస్థితి. ఇక చేతిల పైసల్లేక సబ్బండవర్ణాలు బాధపడుతున్నాయి. గిసోంటి యాళ్లకు నేను ఊరిలోకి వెళ్లి పండుగ అంటే ఏం సంబురం ఉంటుందమ్మా. అంటూ గునుగు పువ్వు గునిగింది.
మళ్లీ భూతల్లి ఆలోచనలో పడ్డది. పల్లె అయినా.. పట్టణమైనా.. చేతిలో పైసలు ఉంటేనే పండుగ. ఓ విప్లవ కవి అన్నట్లు ‘పండుగింట్ల పీనుగెల్ల... పండుగెనుక పండుగొచ్చె.. పిల్లలకు కొనిపెడుదాంటే.. పచ్చనోటు లేకపాయే..’ అన్నట్లుగానే ఉంది పరిస్థితి. కారణం ఏమో కానీ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. భూముల ధరలు పడిపోయాయి. గంజాయి మత్తు పల్లెలను ఆవహించింది. గుడుంబా గుప్పుమంటుంది. బెల్టుషాపులు జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా పల్లెలు, పట్టణాల ఆర్థిక మూలాల్లో మూల్గు తగ్గింది. ఇవన్నీ తలచుకుంటూ పుడమితల్లి వలవల ఏడ్చింది. అలా కన్నీరు పెడుతూనే బంతిపూల దిక్కు చూసింది భూమాత.
ఏడ్వకమ్మా అని బంతిపువ్వు గోముగా కౌగలించుకుంది. గడ్డిపూలు, కట్లపూలు, గుమ్మడిపూలు, పట్టుకుచ్చుల చెట్లు కనిపించకుండా పోయాయి. చెల్కలు లేక.. అన్నీ పొలాలే కావడంతో పువ్వులు దొరకని రోజులు వచ్చాయి. తీరొక్క పూలు ఉంటేనే బతుకమ్మ అవుతుంది అంది భూమాత. అమ్మా నిజమే కానీ.. ఇప్పుడు మార్కెట్ అంతా కృత్రిమ పూల జాతర సాగుతుంది. ప్రకృతి పూల ఉనికే కరువైంది. అయినా.. అమ్మా.. పుడమి తల్లీ.. నీ ఎదపై ఆడే.. పాటే మేమంతా నీ పిల్లలం. నువ్వు చెప్పినట్లుగానే బతుకమ్మ పండక్కి ఊళ్లోకి వెళ్తాం.. అమ్మా అంటూ తంగేడు.. గునుగు పూలు సిద్ధమవుతూ..
చివరిగా ఒక్క మాట అమ్మా. అన్నంపెట్టే అన్నదాతలు, బట్ట నేసే నేతన్నలను చావకుండా చూడమ్మా. ప్రాణం పోతే రాదమ్మా అంటూ బతిమిలాడింది బంతి. ఊరుకో తల్లి ఏడ్వకు అంటూ భూమాత ఓదార్చింది. మారిన కాలానికి ఈ మనుషులే కారణం కదమ్మా.. అడవులను నరికి.. చెట్లను కూల్చి.. గుట్టలను క్వారీలుగా మార్చి.. వాగులను ఇసుక రీచ్లుగా చేర్చి ప్రకృతిని ధ్వంసం చేసి.. భవిష్యత్ను నాశనం చేసుకుంది వీళ్లే కదా రా.. వాగులో ఇసుకను అమ్మి.. వాగొడ్డుకు బతుకమ్మ తెప్పెలను కట్టుకున్న దౌర్భాగ్యం కళ్ల ముందు కనిపిస్తుంది.
అవునమ్మా అంది బంతిపువ్వు. నిజమే తల్లీ అంటూ భూతల్లీ పూలను ఓదార్చింది. పుడమి తల్లి చుట్టూ పూల గుంపు చేరింది. సాయంత్రమవుతోంది. ఊరిలో నుంచి బతుకమ్మ పాట లీలగా వినిపిస్తుంది. ఆ పాట గొంతులో నాటి గంభీర్యం లేక జీరబోతోంది. చప్పట్లు మోగుతున్నాయి. కానీ ఆ శబ్దం వినసొంపుగా లేదు. పిల్లలు ఆడుతున్నారు.. వారిలో ఉత్సాహం లేదు. గోధూలి రేగుతుంది. ఆలమందల ఊసులేదు. దాండియా ఆటలు.. డీజే పాటలు.. కృత్రిమ నవ్వులు.. వాడిన పువ్వులు.. ఆత్మీయత లేని పలకరింపులు.. సెల్ఫోన్లతోనే ఆటలు.. పాటలు. ప్రకృతి పూల శోభ లేక.. కాగితం పూల బతుకమ్మలతో పల్లె బతుకమ్మ పాట పాడుతోంది. ముందు ముందు ఇంకెంతకుందో అంటూ పువ్వులన్నీ గుండెలవిసేలా రోదిస్తున్నాయి.. కన్నీరు పెడుతున్న పువ్వులను చూసిన పుడమి తల్లి గుండె బరువెక్కింది. ఏడ్వకండీ.. ఏడ్వకండీ.. అంటూ భూమాత ఓదార్చుతూ.. మన పండుగ పూట కన్నీరు కార్చితే లోకానికి మంచిది కాదు. మన ప్రకృతి ధర్మాన్ని నెరవేర్చుదాం. మార్పును ఆశిద్దాం. మంచిని కోరుకుందాం. బతుకమ్మ పండుగను ఊరూ వాడ సంతోషంగా జరిగేలా చూద్దాం. అగో.. డప్పులు మోగుతున్నాయి. వెళ్లండి అంటూ భూమాత పిలుపునిచ్చింది. చెంగున దుంకుతూ పూలగుంపు ఇంటింటా చేరింది. బతుకమ్మ పండుగను పూలజాతరను చేసింది.


