‘గురువు’ నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

‘గురువు’ నేత్రదానం

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

కోల్‌సిటీ: బతికున్నంతకాలం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన తొలితరం గురువు.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన సేవామూర్తి.. మరణానంతరం కూడా సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. తన కళ్లతో మరోఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు గీట్ల దామోదర్‌రెడ్డి (79) చేసిన నేత్రదానం ఆదర్శంగా నిలిచింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నేత్రదానం చేయాలన్న ఆయన ఆకాంక్షను గౌరవించిన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలోనూ కళ్లు దానం చేశారు. బీఎస్సీ, బీఈడీ పూర్తిచేసిన ఆయన.. తొలుత గోదావరిఖనిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం సింగరేణి సంస్థలో క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత సింగరేణి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ ప్రధానోపాధ్యాయుడి హోదాలో పదవీ విరమణ చేశారు. శనివారం ఆయన నివాసంలో సదాశయ ఫౌండేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రచార కార్యదర్శి కేఎస్‌ వాసు, జిల్లా అధ్యక్షుడు అరెపెల్లి రాజమౌళి ఆధ్వర్యంలో దామోదర్‌రెడ్డి నేత్రాలను సేకరించారు. కాలనీ అసోసియేషన్‌ ప్రతినిధులు మంథని సంపత్‌, బాలసాని స్వామిగౌడ్‌, బుచ్చిరెడ్డి, డాక్టర్‌ నాగిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు, సదాశయ ఫౌండేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు దామోదర్‌రెడ్డికి నివాళులర్పించారు.

చామంతి ‘వెయ్యి’

మంథని: సద్దుల బతుకమ్మ సందర్భంగా శనివారం మంథనిలో చామంతి కిలో రూ.వెయ్యి పలికింది. బెంగళూర్‌ నుంచి చామంతి తీసుకొచ్చామని అక్కడే ఎక్కువ ధర పలకడంతో పెంచి అమ్మాల్సి వస్తుందని వ్యాపారులు తెలిపారు. కాగా, బంతిపూలు కిలోన్నర రూ.100, సీతమ్మ జడలు రూ.100కు 4 కట్టలు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement