శిక్షణకు కార్పొరేటర్లు డుమ్మా! | - | Sakshi
Sakshi News home page

శిక్షణకు కార్పొరేటర్లు డుమ్మా!

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

బల్దియా ఎదుట పార్కింగ్‌ చేసి ఉన్న రెండు ఏసీ బస్సులు

శిక్షణకు హాజరైన కార్పొరేటర్లు

కోల్‌సిటీ: ప్రజాప్రతినిధుల సామర్థ్యాన్ని పెంచేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం) ఆధ్వర్యంలో పురపాలక పరిపాలన శాఖ తరఫున శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్రంలోని నగర మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు శిక్షణ ఇవ్వగా.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇచ్చేందుకు మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అయితే గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా (ఈఎస్సీఐ) మెయిన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణకు రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ మేయర్‌తోపాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఆహ్వానం అందినప్పటికీ అత్యధిక మంది కార్పొరేటర్లు శిక్షణకు హాజరుకాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే శిక్షణా కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికారుల సమన్వయ లోపమా? లేక నగరపాలక సంస్థలో నెలకొన్న అంతర్గత విభేదాల ప్రభావమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హాజరుకాని కార్పొరేటర్ల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. అయితే మేయర్‌ మినహా మిగతా 59 కార్పొరేటర్లు సకాలంలో శిక్షణకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థకు చెందిన రెండు ఏసీ రాజధాని బస్సులు ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకే బల్దియా కార్యాలయానికి చేరుకున్నటికీ కార్పొరేటర్లు రాకపోవడంతో మధ్యాహ్నం వరకు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుటే ఉంచి తిరిగి వెనక్కి పంపించారు.

రూ.86 వేల ప్రజాధనం వృథా?

ఈ శిక్షణ కోసం రెండు ఆర్టీసీ ఏసీ రాజధాని బస్సులను ఏర్పాటు చేయగా ఒక్కో బస్సుకు రూ.43 వేల చొప్పున మొత్తం రూ.86 వేల మొత్తాన్ని కార్పొరేష న్‌ ఆర్టీసీకి చెల్లించినట్లు సమాచారం. చివరకు బ స్సులు వినియోగంలోకి రాకపోవడంతో ప్రజాధ నం వృథా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు కారణమేంటి..?

రామగుండం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, అధికార కాంగ్రెస్‌కు అత్యధికంగా 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ మెజారిటీ ప్రజాప్రతినిధులు శిక్షణకు హాజరుకాకపోవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీసింది. శిక్షణపై నోటీసులు ఇచ్చినా, అనంతరం ఎలాంటి ఫాలోఅప్‌ లేకపోవడం వల్లే కార్పొరేటర్లు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

59 మందిలో శిక్షణకు హాజరైంది నలుగురే

బల్దియా ఆవరణలో నిలిచిన రెండు ఏసీ బస్సులు

రూ.86 వేలతో ఏర్పాటు చేసిన బస్సులు వృథా

అధికారుల సమన్వయ లోపమా? బల్దియాపై కార్పొరేటర్ల అసంతృప్తా?

59 మందిలో పాల్గొన్నది నలుగురే..

గురువారం నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నాలుగు బ్యాచ్‌లు విభజించిన ఈ శిక్షణకు తొలిరోజున ఎంపిక చేసిన మున్సిపాలిటీల నుంచి అందరూ పాల్గొనగా, రామగుండం నుంచి డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్యతో పాటు కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, నాగరాజు వారి స్వంత వాహనాల్లో శిక్షణకు హాజరయ్యారు. మరో ఆరుగురు కార్పొరేటర్లు హైదరాబాద్‌ వెళ్లేందుకు తెల్లవారుజామున బల్దియా కార్యాలయానికి రాగా తక్కువ సంఖ్యలో ఉండడంతో వారి కోసం బస్సును నడపడం సాధ్యం కాదనే సందిగ్ధంలో అధికారులు పడ్డారు. దీంతో వచ్చిన కార్పొరేటర్లు వెనుదిరి ఇంటికి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement