సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ:
జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపునీరు ఎక్కడపడితే నిల్వ అవుతోంది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ కనిపించడంలేదు.
చర్యలు శూన్యం
జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపా టు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. దోమల నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. రామగుండంలో పరి స్థతి మరింత దారుణంగా ఉంది. వాటి నివారణకు అవసరమైన రసా యనాలులేవు. యంత్రాలు, రసాయనాల కొనుగోలు, మిషన్ల నిర్వహణ పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో వాటిజాడ కనిపించడం లేదు.
రామగుండంలో మరీ అధ్వానం
రామగుండం నగరంలో దోమల నివారణ చర్యలు అటకెక్కాయి. ఎక్కడపడితే అక్కడ నీటినిల్వ పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అక్కడ మలాథియన్ వంటి రసాయనం పిచికారీ చేయడం, ఆయిల్‌బాల్స్ వేయడం, గంబూషియా చేపలు వదలడం వంటి పనులు చేపట్టడమేలేదు.
మూలనపడిన యంత్రాలు..
నగరంలో మూడు భారీఫాగింగ్ యంత్రాలకు ఆటోట్రాలీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి సాంకేతి క సమస్యలతో మూలనపడింది. మిగతావి కండీషన్‌లో ఉన్నా.. ఫాగింగ్ చేయడంలేదు. హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు కూడా గదికే పరిమితమయ్యాయి.
డెంగీ ముప్పు.. కానరాని స్పెషల్ డ్రైవ్..
డెంగీ, మలేరియా, చికున్‌గున్యా ముప్పు పొంచిఉన్నా దోమల నివారణకు ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన దాఖలాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికే సిబ్బంది పరిమితమవుతున్నారు.
మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు
కాగితాలకే పరిమితమైన నివారణ చర్యలు
జిల్లావ్యాప్తంగా వృద్ధి చెందుతున్న దోమలు
ప్రజల జేబుకు చిల్లు
దోమల నివారణకు ప్రతీ కుటుంబం నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేస్తోంది. ప్రధానంగా లిక్విడ్లు, కాయిల్స్, అగరొత్తులు, బ్యాట్లు, దోమతెరలు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. వీటితోపాటు జ్వరాలు వస్తే వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి.


