మంథని: ప్రస్తుతం వర్షాలు కురవడం లేదు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఇవి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ ఆస్పత్రి, రావులచెరువు పునరుద్ధరణ, డ్రైనేజీ పనులపై ఆయన ఆరా తీశారు. జిల్లాలోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు ప్రతీరోజు అల్పాహారం, భోజనం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోదాముల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. మార్కెట్ ఏరియాలో 100 ఫీట్ల రోడ్డు పనులు పరిశీలించారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, కమిషనర్ మనోహర్, కౌన్సిలర్ పెంట రాజు పాల్గొన్నారు.
డిమాండ్లు నెరవేర్చాలి
రామగిరి: సింగరేణి అధికారుల డిమాండ్లను నెరవేర్చాలని మున్నురుకాపు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన అధికారుల దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. పీఆర్పీ బకాయిలు విడుదల చేయడంతోపాటు పే అప్‌గ్రేడేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావాల్సి ఉన్న రూ.56 వేల కోట్ల బకాయిలను చెల్లించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ–3, ఏపీఏ ఏరియా ము న్నూరు కాపు సంఘం నాయకులు దేవ శ్రీని వాస్, రౌతు రమేశ్, సైండ్ల సత్యనారాయణ, అల్లం తిరుపతి, విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి
జ్యోతినగర్: తమ సమస్యలు పరిష్కరించాలని జెన్‌కో ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డి.శ్రీనివాస్, ఎం.మల్లేశంలు కోరారు. ఈమేరకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ జ్యోతిభవన్ అతిథి గృహంలో శనివారం ఆయనను నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించినట్లు సభ్యులు పేర్కొన్నారు.
జీడీకే–5 ఓసీపీలో సంబురాలు
గోదావరిఖని: తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడాన్ని హర్షిస్తూ అధికారు లు, ఉద్యోగులు శనివారం మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు జరుపుకున్నారు. ఆర్జీ–వన్ ఏరియాలోని జీడీకే–5 ఓసీపీలో కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ, సింగరేణి భవిష్యత్‌కు ఎంతోకీలకమైన తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ రావడం సంతోషకరమన్నారు. క్వాలిటీ జీఎం సుజోయ్ మజుందార్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మడ్డి ఎల్లయ్య, జీడీకే–1 ఏజెంట్ ఎల్.రమేశ్, జీడీకే–11 ఏజెంట్ చిలుక శ్రీనివాస్, జీడీకే–5 ఓసీపీ పీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
14న కేంద్రమంత్రి రాక
గోదావరిఖని: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈనెల 14న పారిశ్రామిక ప్రాంతానికి రానున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి తెలిపారు. కేంద్రమంత్రికి కృతజ్ఞత తెలిపేందుకు కార్మికులు, ఉద్గోయులు భారీగా తరలిరావాలని కోరారు.


