పెద్దపల్లి: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వరుసగా ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభు త్వం కూడా దీనిసాగు ప్రోత్సాహానికి రాయితీలూ వర్తింపజేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,150 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సా గు చేయాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల్లో మొక్కలు నాటారు. తద్వారా జిల్లాలో మొత్తం సా గు విస్తీర్ణం ఇప్పటివరకు సుమారు వెయ్యి ఎకరాలకు చేరినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.
దిగుబడి అధికం..
ఆయిల్‌పామ్ ఎకరాకు సగటున 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తాజా గెల టన్ను ధర ప్రస్తుతం రూ.23,852 పలుకుతోంది. ఒక ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు సాగుకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. నాటిన మూడోసంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమై, దీర్ఘకాలం ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ఎకరాపై రూ.1.5 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు.
అంతర్ పంటలతో అదనపు ఆదాయం
ఆయిల్‌పామ్ మొక్కలు పూర్తిస్థాయిలో దిగుబడికి రావడానికి సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈలోగా అంతర్ పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మొక్కలు నాటిన తర్వాత మొదటి సంవత్సరంలో అరటి, రెండో ఏడాది కూరగాయలు సాగు చేయాలి. వీటికి కూడా ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. మొక్కల పెరుగుదల, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణపై వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ, తోటను క్రమపద్ధతిలో సాగు చేయాలి.
రాయితీలతో రైతులకు ప్రోత్సాహం
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు పలు రాయితీలు వర్తింపజేస్తోంది. డ్రిప్, ఎరువులు, మొక్కల సరఫరాకూ ఆర్థిక సాయం చేస్తోంది. ఉత్సాహవంతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
చీడపీడల బెడద లేదు
వరి వంటి సంప్రదాయ పంటలతో పోల్చితే.. ఆయిల్‌పామ్ సాగు చాలా సులభమని సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి వివరిస్తున్నాడు. తను సాగు చేసిన తోటలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయంటున్నాడు. ముఖ్యంగా చీడపీడల బెడద చాలాతక్కువని, అడవిపందులు లేదా కోతుల వంటి వన్యప్రాణులు, ఇతర జంతువులతో నష్టం లేదని వివరించాడు. రైతులు భయం లేకుండా ఆయిల్‌పామ్ సాగు చేసుకోవచ్చని భరోసా ఇస్తున్నాడు.
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం
సుల్తానాబాద్‌రూరల్: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన గోపిడి ప్రభాకర్‌రెడ్డి ఆయిల్‌పామ్ సాగు చేసి అద్భుత ఫలితాలు సాధించాడంటూ శుక్రవారం శ్యాంప్రసాద్ సన్మానించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. సర్పంచ్ కొదాటి సాయికిరణ్, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం
జిల్లాలో వెయ్యి ఎకరాలకు చేరిన సాగు
ఈ ఏడాది లక్ష్యం 1,150 ఎకరాలు
ఇప్పటివరకు పంట వేసింది సుమారు 200 ఎకరాలు


