సాక్షి పెద్దపల్లి: జనాభా లెక్కలు అంటే కేవలం వ్యక్తులు, కుటుంబాల సంఖ్య నమోదు మాత్రమే కాదు.. ప్రతీ గ్రామం చరిత్ర, ప్రత్యేకతలు, మౌలిక వసతుల వివరాలు కూడా డిజిటల్ రూపంలో భద్రం కానున్నాయి. 2026 జనాభా లెక్కల్లో భాగంగా గ్రామాల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియలో ప్రతీ గ్రామం ఎలా ఏర్పడింది? ఆ పేరుకు కారణం ఏమిటి? గతంలో ఏ పేరుతో పిలిచేవారు? గ్రామంలో ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలు, చెరువులు, విద్యా, వైద్య, ఇతర ప్రజా సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని 263 గ్రామపంచాయతీల చరిత్ర, విశేషాలు ఇకపై డిజిటల్ రూపంలో భద్రం కానున్నాయి.
గ్రామం ఎలా పుట్టింది? పేరు ఎలా వచ్చింది?
ప్రతీ గ్రామం వెనుక ఉన్న చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మీ ఊరు పేరు ఎలా వచ్చింది? పాత పేరు ఏమిటి? ఊరి ఆవిర్భావ కాలం, అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలు, స్థానికంగా ప్రచారంలో ఉన్న చారిత్రక విశేషాలు, చెరువులు, కోటలు, శాసనాలు, వారసత్వ కట్టడాలు వంటి అంశాలను నమోదు చేయనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధి, రెవెన్యూ వివరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంకులు, తాగునీటి వసతి, రహదారులు, ఇతర మౌలిక వసతులు.. ఇలా ప్రతీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రత్యేక యాప్‌లో డిజిటల్ రూపంలో అధికారులు నమోదు చేయనున్నారు.
అధికారులకు ప్రత్యేక శిక్షణ
జిల్లాలోని 263 గ్రామపంచాయతీలకు సంబంధించిన చారిత్రక, పరిపాలన, సామాజిక, మౌలిక వసతుల వివరాలను ఈ ప్రక్రియలో ఏ సమాచారం ఎలా నమోదు చేయాలి, గ్రామ చరిత్రను ఏ విధంగా సేకరించాలి, మొబైల్ యాప్ వినియోగం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పంచాయితీ కార్యదర్శులు, జీపీవోలను క్షేత్రస్థాయి సిబ్బందిగా, తహసీల్దార్లను పర్యవేక్షకులుగా నియమించారు. మున్సిపాలిటీల్లో కమిషనర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శిక్షణ అనంతరం గ్రామాల వారీగా సమాచార సేకరణ ప్రారంభం కానుంది.
చిన్న కుటుంబాలే ఎక్కువ
జిల్లాలో ఇప్పటికే గృహగణన ప్రక్రియ పూర్తికాగా, సేకరించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ చేశారు. 2026 జనాభా లెక్కల తొలిదశలో నిర్వహించిన గృహగణన ప్రకారం పెద్దపల్లి జిల్లాలో మొత్తం 2,21,504 గృహాలు నమోదైనట్లు తెలుస్తోంది. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గి, చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒకే ఇంట్లో మూడు తరాలు కలిసి నివసించే కుటుంబాల కంటే భార్యాభర్తలు, పిల్లలతో కూడిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైపు మొగ్గు చూపుతుండటంతో గృహాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
పట్టణీకరణ ప్రభావం
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహాలు, జనాభా పెరుగుదల నమోదైనట్లు గృహగణనలో తేలింది. ఉపాధి, విద్య, వ్యాపార అవకాశాల కోసం ప్రజలు పట్టణాల వైపు తరలివెళ్తుండటంతో పట్టణ జనాభా క్రమంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు.
డిజిటలైజేషన్‌తో ప్రయోజనం
గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతుల వివరాలను డిజిటలైజ్ చేయడం వల్ల, ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి మరింత స్పష్టమైన డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ డిజిటల్ నమోదు ద్వారా ప్రతీ ఊరి ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం భవిష్యత్ తరాలకు డిజిటల్ రూపంలో సురక్షితంగా అందనుంది.
ప్రతీ ఊరికి ఆన్‌లైన్‌లో ఒక చరిత్ర
2026 సెన్సెస్‌లో సరికొత్త అధ్యాయం
జనాభా లెక్కల్లో భాగంగా ప్రతీ ఊరు సమగ్ర సమాచారం రికార్డు
ఈనెల 13 నుంచి అధికారులకు శిక్షణ తరగతులు
జిల్లాలో పెరిగిన చిన్న కుటుంబాల సంఖ్య, పట్టణీకరణ


