అబద్ధాలాడందే హరీశ్‌కు నిద్రపట్టదు | - | Sakshi
Sakshi News home page

అబద్ధాలాడందే హరీశ్‌కు నిద్రపట్టదు

Jul 3 2026 1:52 AM | Updated on Jul 3 2026 1:52 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రతీరోజు వంద అబద్ధాలు ఆడందే బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు నిద్రపట్టదని, తెలంగాణకు అసలైన ఎల్‌నినో ఆయనేనని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ధ్వజమెత్తారు. అబద్దాలల్లో పోటీపెడితే దేశంలోనే కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉంటారని ఎద్దేవాచేశారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌ బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామ ఇంజినీర్‌, అల్లుడు సబ్‌ ఇంజినీర్‌ అయి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవక ముందే కుంగి పోయాయన్నారు. దీనికి కారకులెవరో హరీశ్‌ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారితీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ఇప్పటికే కొన్ని మరమ్మతు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణకు అసలైన ఎల్‌నినో హరీష్‌రావేనని, వర్షాలు కురవద్దు ప్రాజెక్టులు నిండొద్దని కోరుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు ద్వారా ఫస్ట్‌ ఫేజ్‌లోనే 5 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తుచేశారు. కానీ... కాళేశ్వరం పేరుతో కట్టిన లిఫ్టుల ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కనీసం 50 వేల ఎకరాలకై నా నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇక్కడి నీళ్లను మెదక్‌ జిల్లాలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్లకు తరలించుకుపోయి సొంత భూములను తడుపుకున్నారని ఆరోపించారు. ఏకకాలంలో రూ.21 వేల కోట్లు కేటాయించి 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని, లబ్ధిపొందిన రైతులు మళ్లీ బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాలు తెచ్చుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల హయాంలో ఇలా ఏకకాలంలో రుణమాఫీ జరిగి, మళ్లీ లోన్లు తెచ్చుకున్న ఒక్క రైతునైనా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చూపించగలరా అని సవాల్‌ విసిరారు. ఇప్పటికే మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేశామని అన్నారు. మరో వారం రోజుల్లో మిగతా రైతులందరికీ రూ. 9 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామన్నారు. సమావేశంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, కరీంనగర్‌ ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నరసయ్య, కాంగ్రెస్‌ నాయకులు, పడాల అజయ్‌ గౌడ్‌, మెతుకు కాంతయ్య, చెల్లొజ రాజు, చిలుక సతీష్‌ పాల్గొన్నారు.

ఆయనే తెలంగాణకు అసలైన ఎల్‌నినో

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement