జ్యోతినగర్: భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్‌షిఫ్‌లోని కాకతీయ ఆడిటోరియంలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అర్హుడైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ఇన్‌చార్జి కమిషనర్ అరుణశ్రీ, సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలన
రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ జంగాలపల్లె శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గురువారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ స్వామి, కమిషనర్ అరుణశ్రీ, తహసీల్దార్ రవీందర్‌రావు, కార్పొరేటర్లు బాపు, రవి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరి తదితరులు ఉన్నారు.


