మొలకెత్తని ఆశలు | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని ఆశలు

Jul 1 2026 11:48 PM | Updated on Jul 1 2026 11:48 PM

సాక్షి, పెద్దపల్లి:

రుద్ర కార్తె ప్రవేశించి వారంరోజులు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. వానాకాలం సాగు ఆశించినస్థాయిలో ముందుకు సాగడంలేదు. సాధారణంగా జూన్‌ తొలివారంలోనే వర్షాలు విస్తారంగా కురిసి వివిధ పంటలతో పొలాలు పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి జల్లులు పడగానే పత్తి విత్తనాలు వేసినా ఇంకా మొలకలు రాలేదు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వరి నాట్లు వేయాల్సిన సమయం దాటిపోతుండగా పొలాలు నీళ్లులేక ఎండిపోవడంతో రైతులు తమ ఆశలన్నీ భారీవర్షాలపైనే పెట్టుకున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి. ఎండల తీవ్రత, వర్షాల ఆలస్యంతో బావులు, బోర్లు నీరందించడం లేదు. చెరువులు, కుంటల్లో నీరులేక ఆయకట్టులోనూ సాగు ప్రారంభం కాలేదు. వర్షాధారం సాగుపైనే ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

పదిరోజులే వర్షం.. లోటు వర్షపాతం

జూన్‌ ఒకటి నుంచి జూలై ఒకటో తేదీ వరకు జిల్లాలో కేవలం పదిరోజులే వర్షం నమోదైంది. జూన్‌ 5న చిరుజల్లులు ప్రారంభమైనా.. అన్ని మండలాలను తడపలేదు. ఇప్పటివరకు సాధారణంగా 168.5 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 164 మి.మీ. మాత్రమే నమోదై 3 మి.మీ. లోటు ఏర్పడింది. ఈసారి మోస్తరు కాకుండా చిరుజల్లులే కురవడంతో వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడలేదు. నేలలో తేమ నిలవడం లేదు. విత్తనాలు ఎండిపోవడం, నారుమడులు సిద్ధం కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వారం రోజుల్లో భారీవర్షాలు కురవకపోతే వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎదురైతే దిగుబడి తగ్గే ప్రమాదంతోపాటు పెట్టుబడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

38 వేల ఎకరాల్లోనే..

జిల్లాలో ఈవానాకాలంలో 2,15,500 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. 52,094 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా 19,970 ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. వాటిలో కూడా అనేక ప్రాంతాల్లో మొలకలు రాక మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 886 ఎకరాల్లో మొక్కజొన్న సాగు లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 79 ఎకరాల్లో, 38 ఎకరాల కంది లక్ష్యానికి 32 ఎకరాల్లోనే సాగు నమోదైంది. ఇప్పటివరకు 5,240 ఎకరాల్లో వరినారు పోయగా, అది 1,06,140 ఎకరాలకు సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం

వర్షాల కోసం రైతుల ఎదురుచూపు

ఇంకా ప్రారంభంకాని వరినాట్లు

ఎక్కడా మొలకెత్తని పత్తి విత్తనాలు

సగానికి పడిపోయిన సాగు విస్తీర్ణం

పడిపోతున్న భూగర్భ జలాలు

ఆందోళనలో అన్నదాతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement