పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, నాన్ జ్యుడీషియల్ స్టాంపు వెండర్లు, మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ సేవలకు నాలుగు రోజులుగా అంతరాయం కలుగుతోంది. తమ అవసరాలు, పనుల నిమిత్తం మండల, జిల్లా కేంద్రానికి పల్లెవాసులు వచ్చినా అదే సమాధానం వస్తోంది. ఏమీచేయలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
పోర్టల్‌లో సవరణ కోసం..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ఈసీ(ఎంకబరెన్స్ సర్టిఫికెట్) తదితర సేవల కోసం పోర్టల్‌లో కొన్నిమార్పులు, చేర్పులు చేస్తున్నందున ఆన్‌లైన్ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు. భూక్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా మందగించింది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ కోసం మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
స్టాంప్ పేపర్లకు ఇక్కట్లే..
స్టాంప్ పేపర్ల జారీ ప్రక్రియ గతంలో మాన్యువల్‌గానే ఉండేది. కొంతకాలం క్రితం దీనిని ఆన్‌లైన్‌కు మార్చేశారు. స్టాంప్ పేపర్ కావాలన్నా, ఫ్రాంక్లిన్ చేయించాలన్నా ఆన్‌లైన్ సర్వర్‌ను ఆశ్రయించాల్సిందే. ప్రస్తుతం ఇది మొరాయిస్తుండడంతో సేవలు పొందలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
మీసేవ కేంద్రాల్లోనూ
మీసేవ కేంద్రాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సేవలకు ఆన్‌లైన్ మొరాయిస్తోంది. బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు అవసరమైన ఈసీ, పహాణి, 1–బీ లాంటి సేవలు అందక రైతులూ అవస్థలు పడుతూ కనిపించారు. కొత్త రుణాలు, పాత వాటిని రెన్యూవల్ చేసేందుకు అవసరమైన డాకుమెంట్లను అన్నదాతలు పొందలేక పోతున్నారు.
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
మీసేవ కేంద్రం వద్ద వినియోగదారుల నిరీక్షణ
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్తంభించిన రిజిస్ట్రేషన్లు
నాన్ జ్యుడీషియల్ బాండ్లకు తప్పని ఇబ్బందులు
నాలుగు రోజులుగా నిలిచిన సేవలతో సర్వత్రా నిరసనలు


