చకచకా.. ఇండోర్ స్టేడియం పనులు చివరిదశకు చేరిన స్టేడియం నిర్మాణం పనులు రూ.2.30 కోట్లతో సాగుతున్న పనులు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం చేపట్టిన ఇండోర్ స్టేడియం పనులు చకచకా సాగుతున్నాయి. ఇందుకోసం విద్యామౌలిక వసతుల సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం రూ.2.30 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులు ప్రస్తుతం చివరిదశకు చేరుకున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం చేపట్టిన పనులను ఇంటిగ్రేటెడ్ స్టేడియంగా తీర్చిదిద్దేలా గతేడాది సెప్టెంబర్ 27న శకుస్థాపన చేశారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు..
బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆడుకునేందుకు అనువైన కోర్టులు లేక అవస్థలు పడుతున్నారు. వారికి జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతున్న ఇండోర్ స్టేడియం ఎంతోసౌకర్యంగా ఉంటుందని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం పనులు చేపట్టారు. మార్కెట్‌లో కన్నా ప్రస్తుత ప్రధాన కూరగాయల మార్కెట్‌నే ఆధునికీకరించేలా పనులు చేపట్టి పూర్తిచేసేలా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పనులు చేపట్టారు. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఎలా వినియోగించుకోవాలని ఆలోచించి ఇండోర్ స్టేడియంగా మార్చేలా ప్రభుత్వానికి కలెక్టర్ శ్రీహర్ష ద్వారా ప్రతిపాదించారు. దీంతో విప్ అవసరమైన నిధులు మంజూరు చేయించారు. ఇప్పటిదాకా పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్న బసంత్‌నగర్ అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, సింగరేణి స్టేడియంలోకి వెళ్లి క్రీడాకారులు ఆడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల్లో అందుబాటులోకి ఇండోర్ స్టేడియం రానుండడంతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు, శిక్షణ పొందేందుకు అవకాశం కలుగనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మినీస్టేడియం అవసరమే..
జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో మినీస్టేడియం ఏర్పాటుకు ఏనాడో ప్రతిపాదించినా అవసరమైనంత స్థలం అందుబాటులో లేనికారణంగా పనులు ముందుకు సాగడం లేదు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న పురావస్తుశాఖ స్థలం ఏళ్లకాలంగా వృథాగా ఉంటోందని, ఆ స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేలా ఆ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.


