రోగుల బంధువులతో డీల్ కుదిర్చేందుకు ప్రత్యేక దళం కుదిరితే సెటిల్‌మెంట్ లేదంటే వార్నింగ్‌లు ప్రైవేటు ఆర్మీపై పోలీసుశాఖ తీవ్ర అభ్యంతరం వివరణ ఇవ్వాలంటూ వైద్యులకు నోటీసులు జారీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో ఏదైనా జరగరానిది జరిగి, రోగులు ఆందోళన చేస్తే పోలీసులు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి ఫిర్యాదులు తీసుకుంటారు. వీలును బట్టి కేసులు నమోదు చేయడం లేదా హెచ్చరించి వదిలేయడం చూస్తుంటాం. ఇది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ.. కరీంనగర్‌లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు చట్టాన్ని దాటి ఒకడుగు ముందుకేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రొటెక్షన్ ఆర్మీ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఆర్మీకి వెంటనే సమాచారం వెళ్తుంది. వెంటనే ఈ ఆర్మీ రంగప్రవేశం చేస్తుంది. రోగులతో మాట్లాడటం, వారిని ఆందోళన చేయకుండా వారిని నయానో, భయానో బెదిరించి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఖాళీ చేయించడం వీరి ప్రాథమిక విధిగా పెట్టుకున్నారు. ఈ ప్రైవేటు ఆస్పత్రుల రక్షక దళం విషయంలో కరీంనగర్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు రెండుగా చీలిపోయారు. కొందరు ఈ ఆర్మీని సమర్థిస్తుండగా.. ఇది వైద్యుల వృత్తి ధర్మానికి విరుద్ధమని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలాంటి వారిని నియమించడం చట్టానికి వ్యతిరేకమని కుండబద్దలు కొడుతున్నారు.
సీపీ మందలింపు
ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటు విషయం నిఘా వర్గాల ద్వారా పోలీసులకు తెలిసింది. సీపీ కార్యాలయం, ఏసీపీ కార్యాలయాలు ఐఎంఏ ప్రతినిధులను పిలిచి ఆర్మీపై వివరణ కోరగా.. వారు తమకు ఎలాంటి సమాచారం లేదని, తాము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా ఏర్పడిన ఈ ఆర్మీ కొనసాగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీంతో సదరు ఆర్మీని నిర్వహిస్తున్న రెండు ప్రముఖ ఆసుపత్రుల వైద్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ఉండగా.. ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ పేరుతో సెటిల్మెంట్లు చేయడమేంటి? అని పోలీసులు నోటీసుల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని, ఇలాంటి ఆర్మీల ఏర్పాటు చట్టవిరుద్ధమని నోటీసుల్లో స్పష్టంచేశారు.
నోటీసులు ఇచ్చాం
ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఐఎంఏ ప్రతినిధులతోపాటు, ఈ ఆర్మీని నిర్వహిస్తున్న వైద్యులతో మాట్లాడాం. ఆసుపత్రుల్లో సమస్యలు తలెత్తితే పోలీసులు, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయ కమిటీని రూపొందించుకోవాలని సూచించాం. ఎవరికి వారు ప్రైవేటు ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం తగదని, వెంటనే ఆర్మీని నిలిపివేయాలని ఆదేశించాం.
– గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్
ఎందుకు పుట్టిందీ
ఈ ఆర్మీ?
కొంతకాలంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలో తప్పులు జరిగాయని, వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారంటూ వారి బంధువులు ఆందోళనకు దిగడం చూస్తూ ఉన్నాం. వైద్యుల తప్పు లేకుంటే ఆసుపత్రుల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరతారు. కానీ, ఆసుపత్రుల తప్పులు ఉంటే.. రోగుల బంధువులకు తృణమో, పణమో ఇచ్చి వివాదాన్ని సర్దుమణిగింపజేస్తారు. ఇకపై ఆసుపత్రుల్లో వైద్యం వికటించినా, చికిత్స సమయంలో రోగి మరణించినా, ఫీజు విషయంలో వివాదం చెలరేగినా.. రోగుల బంధువులను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీని రూపకల్పన చేశాయి. ఇందులో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది వైద్యులు దీనికి మద్దతు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ ఆలోచనను తోసిపుచ్చింది. ఇది వైద్య వృత్తికి, ప్రమాణాలకు పూర్తి విరుద్ధమని తేల్చిచెప్పింది. అయినా, వీరు మాత్రం ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలకాలంలో రెండు ఘటనల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన రోగుల కుటుంబాలను ఆందోళన చేయకుండా బెదిరించి పంపినట్లు తెలిసింది.


