‘ప్రత్యామ్నాయం’ ఫలించేనా..? | - | Sakshi
Sakshi News home page

‘ప్రత్యామ్నాయం’ ఫలించేనా..?

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

ఎల్‌నినో ప్రభావంతో వరి సాగుపై సందిగ్ధం స్వల్పకాలిక వరి ఎంచుకోవాలంటున్న అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అవగాహన వరి విత్తనాల ఎంపికపై రైతుల్లో ఆందోళన

వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈసారి జిల్లాలో 2.15లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి పంటతో పాటు మొక్కజొన్న, కంది, మిరప, పసుపు పంటలను వందల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పంట మార్పిడి విధానానికి స్వస్తి

ఏటా పంట మార్పిడి విధానం పాటించాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. భూమిలో ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం ద్వారా భూసారం తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం రాకముందు గ్రామాల్లో ఖరీఫ్‌లో వరి పంట సాగు చేసి రబీ సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేస్తుండేవారు. కానీ, ప్రస్తుతం రెండు సీజన్‌లలో కేవలం వరి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో..

ఈసారి సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా పడే అవకాశం ఉందని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్‌, జూలై మాసాల్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వరి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో పంట వచ్చే స్వల్పకాలిక వరిని ఎంచుకోవాలని, తద్వారా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఖరీఫ్‌లోనూ ఆరుతడి పంటలు

సాధారణంగా ఆరుతడి పంటలు తక్కువ నీటితోనే సాగు చేస్తుంటారు. వేసవికాలంలో తక్కువ నీరు ఉండటం, పంట చేతికందే సమయానికి సాగు నీరు అందకపోవడంలాంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో వేసవికాలం సీజన్‌లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేసేవారు. కానీ, ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలంటూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో వరి సాగుపై ప్రభావం చూపుతుందని, ఈ క్రమంలో వరి కాకుండా పెసర, మినుములు, కంది, టమాట, తీగజాతి కూరగాయ పంటలు, ఆకుకూరలు పండిండచమే మేలని పేర్కొంటున్నారు.

మంథనిరూరల్‌: వర్షాకాలం సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా కసరత్తు చేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలంటూ ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వానాకాలం సీజన్‌లో అత్యధికంగా వరి సాగు చేయడం అలవాటుగా మారింది. కనీసం పంట మార్పిడి లేకుండానే వరి సాగు చేస్తున్నారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, ఈ క్రమంలో ఆరుతడి, స్వల్ప కాలిక వరి పంటలు సాగు చేసుకోవాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement